‘మూడుజాముల కొదురుపాక’కు ఉన్న ప్రత్యేకతేమిటంటే...

‘మూడుజాముల కొదురుపాక’కు ఉన్న ప్రత్యేకతేమిటంటే...

ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాలు, చెట్లు, చుట్టూ నాలుగు కొండల మధ్య ఉన్న గ్రామం ‘కొదురుపాక’. ప్రపంచంలో ఎక్కడైనా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఈ నాలుగు జాములు ఉంటాయి. కానీ, ఈ ఊళ్లో ఒక జాము మిస్సయింది! అందుకని దీన్ని ‘మూడుజాముల కొదురుపాక’ అని పిలుస్తారు. అదెలా? ఒక జాము ఎలా మిస్సయింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

ఉరుకుల పరుగుల జీవితం గడిపేవాళ్లని సిటీల్లో చూస్తుంటారు. కానీ, ఇదొక చిన్న గ్రామం అయినా ఇక్కడి వాళ్ల లైఫ్ స్టైల్​ కూడా హడావిడిగా ఉంటుంది. కారణం అక్కడ పగలు తక్కువ, రాత్రి ఎక్కువ అన్నట్లు ఉంటుంది వాతావరణం. ఆ ఊరికి వెళ్తే ఉదయాన్నే లేచే అలవాటున్నా ఆలస్యంగా లేస్తారు. టైం అవుతోందని మాటిమాటికీ చూసుకుని కంగారు పడినా లాభం లేదు. ఎందుకంటే ఇక్కడికి సూర్యుడే ఆలస్యంగా వస్తాడు. కాబట్టి అప్పటివరకు తెల్లవారదు. అదటుంచితే, తెల్లవారింది కదా అని పనులు కూడా నిదానంగా మొదలుపెడితే కుదరదు. దానికో మెలిక ఉంది. పగటి సమయం చాలా తక్కువ ఇక్కడ. పైగా త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి.. సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు అక్కడి వాళ్లు. అంతేకాకుండా ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లిన వాళ్లు కూడా వీలైనంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఈ గ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రానికి10 కిలో మీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్​ నుంచి నాలుగ్గంటలు ప్రయాణం.

మూడు జాములకు కారణం

కొదురుపాక ప్రజలు లైఫ్​ స్టైల్​, అక్కడి వాతావరణం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రపంచంలో ఈ గ్రామం నలుమూలల తూర్పున గొల్లగుట్ట, పడమర రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాము బండ గుట్ట అని నాలుగు గుట్టలు ఉన్నాయి. తూర్పున ఉన్న గొల్ల గుట్ట, గ్రామానికి అడ్డుగా ఉండటంతో సూర్యోదయం ఆలస్యం అవుతుంది. అందుకని కొదురుపాకలో సూర్యకిరణాలు ఒక గంట ఆలస్యంగా పడతాయి. అలాగే సూర్యుడు నాలుగు గంటలకే పడమరలో ఉన్న రంగనాయకుల గుట్ట చాటుకు వెళ్లిపోతాడు. దాంతో గ్రామంలో చీకట్లు కమ్ముకొస్తాయి. అలా మూడో జాము సాయంత్రం కాకుండానే చీకటి పడిపోతుంది. దీంతో నాలుగు గంటలకే ఇండ్లల్లో లైట్లు వెలుగుతాయి. అందుకే కొదురుపాకను మూడు జాముల కొదురుపాక అని పిలుస్తున్నారు. 

ఆలయాల ప్రత్యేకత

శాతవాహన, జైనుల కాలంలో నిర్మించిన రాజరాజేశ్వరస్వామి ఆలయం, నంబులాద్రీశ్వరస్వామి ఆలయాలతో గ్రామానికి ప్రత్యేకత ఏర్పడింది. శిథిలావస్థలో ఉన్న రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని బాగు చేసి పూజలు జరిగేలా చేశారు. శ్రీనంబులాద్రి దేవాలయంలో సంవత్సరం పొడవునా పూజలు జరుగుతాయి. దీంతో భక్తులు, టూరిస్ట్​లతో గుడి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. నాలుగు గంటలకే చీకటి పడుతుండటంతో గ్రామంలోని పొలం పనులు కూడా అప్పటికే పూర్తి చేసుకొని రైతులు ఇండ్లకు చేరుకుంటారు. అలాగే గ్రామంలో ఇతర వ్యవహారాలన్నీ నాలుగు గంటల లోపే పూర్తి చేసుకుంటారు. ఇక్కడ చలికాలం, వర్షాకాలం అయితే మూడు గంటలకే సూర్యుడు మాయమైపోతాడు. ‘‘ఇక్కడ మంచి వాతావరణంతో పాటు, పక్కనే హుస్సేన్​మియా వాగు ప్రవహిస్తోంది. నాలుగు గుట్టలు దగ్గర ఉన్నాయి. వాటిని కలుపుతూ రోప్​ వే ఏర్పాటు చేస్తే, టూరిస్ట్​లు ఇంకా పెరుగుతారు. దీంతో గ్రామంతో పాటు జిల్లా కూడా డెవలప్ అవుతుంది. పగలు తక్కువగా ఉండడం వల్ల సంపాదన కష్టమైన ఊరివాళ్లకు ఉపాధి కూడా దొరుకుతుంది” అని శివాలయం అర్చకుడు పర్వతగిరి గురుమూర్తి అన్నారు.

చరిత్ర కలిగిన గ్రామం

శాతవాహనులు, జైనుల కాలం నుంచి ఈ గ్రామానికి చరిత్ర ఉంది. అప్పుడు నిర్మించిన దేవాలయాలు ఇంకా ఇక్కడ వాడుకలోనే ఉన్నాయి. శ్రీరాజరాజేశ్వర స్వామి, నంబులాద్రిస్వామి ఆలయాలు ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాముల కొదురుపాకకు గుర్తింపు ఉంది. ఈ ఆలయాలను దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. వచ్చినవాళ్లు సాయంత్రం నాలుగింటికే చీకటి పడటం చూసి ఆశ్చర్యపోతుంటారు. 

- పొన్నమనేని బాలాజీ రావు, ఎంపీపీ, సుల్తానాబాద్

- వడ్లేపల్లి రవీందర్, పెద్దపల్లి జిల్లా, వెలుగు 

కిరణ్ గూడూరు