పనులు ఇంత నిదానం అయితే ఎలా..? వేగం పెంచండి

పనులు ఇంత నిదానం అయితే ఎలా..? వేగం పెంచండి

ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

జూన్‌‌‌‌ నాటికి సత్తుపల్లి, ఇల్లెందుకు నీళ్లివ్వాలి

కొత్త లిఫ్టుల నిర్మాణానికి టెండర్లు పిలవండి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సీతారామ లిఫ్ట్‌‌‌‌ స్కీం పనులను స్పీడప్​ చేయాలని సీఎం కేసీఆర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లను, ఇంజనీర్లను ఆదేశించారు. ప్రగతి భవన్‌‌‌‌లో గురువారం ఈ ప్రాజెక్టు పనులపై ఆయన రివ్యూ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ఫోకస్​ పెట్టాలన్నారు. ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పాటు నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాలువ ఆయకట్టును కలుపుకొని 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పారు. ‘‘దుమ్ముగూడెం వద్ద గోదావరిలో ఏడాది పొడవునా నీళ్లు పుష్కలంగా ఉంటాయి. అక్కడి నుంచి మొత్తం ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వచ్చు. దుమ్ముగూడెం నుంచి ఎత్తిపోసే నీటిని ఇల్లెందు, సత్తుపల్లి వైపు, సాగర్‌‌‌‌ ఎడమ కాలువపై ఉన్న పాలేరు రిజర్వాయర్‌‌‌‌ వరకు తరలించాలి. ఇల్లెందు, సత్తుపల్లికి నీటిని తరలించే కాల్వల సర్వే వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్వడెక్టులు నిర్మించి పాలేరు వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్‌‌‌‌ వరకు పూర్తి చేయాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. గోదావరి నుంచి తరలించే నీటితో సాగర్‌‌‌‌ ఆయకట్టును స్థిరీకరించాలి” అని కేసీఆర్​ చెప్పారు. మంత్రులు పువ్వాడ అజయ్‌‌‌‌, ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉపేందర్‌‌‌‌రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, సీఎస్‌‌‌‌ సోమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీలు రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌, రామకృష్ణారావు, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌, ఈఎన్సీలు మురళీధర్‌‌‌‌, హరిరాం, సీఈలు వెంకటకృష్ణ, శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌, మధుసూదన్‌‌‌‌రావు, ఎస్‌‌‌‌ఈ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.