V6 News

ఆధ్యాత్మికం : ధైర్యమంటే ఏంటీ.. ధైర్యవంతులు అని ఎవర్ని అంటారు.. శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..!

ఆధ్యాత్మికం : ధైర్యమంటే ఏంటీ.. ధైర్యవంతులు అని ఎవర్ని అంటారు.. శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..!

'ధైర్యవంతులు మోహానికి లోనుకారు' అంటాడు శ్రీ కృష్ణ - భగవానుడు. అసలు ధైర్యవంతులు అంటే ? ధైర్యం కలవారు. ధైర్యం అంటే.. ఎట్టి పరిస్థితులలోనూ భయపడకుండా, కంగారు పడకుండా స్థిరచిత్తంతో ఉండగలగటం, ధైర్యం అంటే పరాక్రమాన్ని ప్రదర్శించటం అనుకుంటాం. అది ధైర్యం కాదు, వీరత్వం. పరిస్థితులని అనుసరించి ప్రాణరక్షణ కోసం పరమ పిరికి జంతువైన పిల్లి కూడా మీద పడి రక్కుతుంది. అది ధైర్యమా ? కాదే. ఎటువంటి పరిస్థితులలోనైనా చెదరకుండా ఉండే మానసిక స్థితిని ధైర్యము లేక ధీరత అంటారు.

ఇది ఎంత ఆచరణాత్మకమో అంత కష్టం. తేలికైన దానిని, ఉపయోగపడేదానిని ఆచరించాలనిపించదు. ఎంత కష్టమైతే అంత గొప్పగా భావించటం మానవ సహజం. అది ఎంత సులభమో తెలియచెప్పవలసిన అవసరం ఉంది.

ప్రతికూల పరిస్థితులకి కుంగిపోవటం, సానుకూల పరిస్థితులకి పొంగిపోవటం తరచుగా మనం చూస్తూ ఉంటాం. రెండూ సరి కాదు. అదేదో ఆధ్యాత్మిక లక్షణం అని భ్రమ చాలామందికి. కానీ అది శారీరక, మానసిక ఆరోగ్యాలని కలిగించి సుఖంగా ఉండటానికి సహకరిస్తుంది. అంతే కాదు, సమస్యలని పరిష్కరించటానికి వీలవుతుంది. 

ఏదో ఒక సమస్యని ఎదుర్కోవలసి వచ్చింది అనుకుందాం. కంగారు పడితే సమస్య పరిష్కారం కాదు. పైగా మరింత క్లిష్టమవుతుంది. ప్రశాంతంగా ఆలోచించినప్పుడు పరిష్కారం వెంటనే స్ఫురిస్తుంది. ఉదాహరణకి నడుస్తూ వెళుతుంటే దారిలో పాము కనిపించింది అనుకుందాం....

కంగారుపడితే దాని దారిన అది వెళుతున్న పాము మీద కాలు వెయ్యటమో, అరిచి దాని దృష్టిని ఆకర్షించటమో జరుగుతుంది. అదే కలత పడకుండా ప్రశాంతంగా ఉన్న చోటనే కదలక మెదలక ఉంటే దాని మానాన అది వెళ్ళిపోతుంది. చేసిందల్లా ధైర్యంగా ఉండి ఏమీ చెయ్యకపోవటమే. కొన్ని మార్లు ఊరకుంటే సరిపోదు. ఏదో ఒకటి తగినట్టుగా చేయవలసి ఉంటుంది. దేనికైనా ప్రధానంగా ఉండవలసింది ధీరత.

అర్జునుడు దుఃఖిస్తున్నది ఎందుకు? తన బంధువులు, మిత్రులు, గురువులు మరణించబోతున్నారు అని. ఇంతకుముందు యుద్ధాలు చేసినప్పుడు ఇటువంటి బాధ ఎందుకు కలగలేదు ? అప్పుడు వారు ఎవ్వరూ "నా" వారు అనుకోలేదు. కనుక. 'నా' అన్న భావన ఉన్నప్పుడే ఈ మనోదౌర్బల్యం కలుగుతుంది. సమస్యకి పరిష్కారం కావాలంటే దానిని తనదిగా కాక మరెవ్వరిదో అన్నట్టు చూడగలిగితే తేలికగా దాని నుండి బయటపడే మార్గం కనపడుతుంది. 'నేను', 'నాది' అనే భావన కలగగానే దారి కనపడదు అనటం కన్నా నచ్చటం, నచ్చకపోవటం అనేవి మధ్యలో అడ్డుతగులుతూ ఉంటాయన్నది వాస్తవం.

'నా వారు' అనే మమకారం ధృతరాష్ట్రుడి కంటికి శాశ్వతంగా పొరలు కప్పినట్టే, అర్జునుడి కళ్లకి తాత్కాలికంగా 'నా వారు' అనే వ్యామోహపు పొర కమ్మింది. ఆ బేలతనాన్ని వదులుకుంటే వ్యామోహం ఉండదు. కర్తవ్యం కనపడుతుంది. నడిపిస్తుంది.
 
మోహం సత్యాన్ని చూడనీయదు. తాము అనుకున్న దానినే పట్టుకుని పాకులాడుతుంది. మోహానికున్న మరొక రూపమే మూఢత్వం. ధీరత ఉన్నవారికి మూఢభావాలు ఉండవు. సత్యదర్శనులై ఉంటారు. ఇది అర్ధం కావటానికి ఒక చక్కని, అందరికీ కనపడే ఉదాహరణ చూపిస్తాడు శ్రీ కృష్ణుడు.

జగద్గురువు కదా. శిష్యుడికి ఎట్లా చెపితే అర్థం అవుతుందో, ఏ పోలిక చెపితే మనసుకెక్కుతుందో బాగా తెలుసు. అందుకే మానవ జీవితంలో ఉండే దశలని ఉదాహరణగా తీసుకున్నాడు. బాల్యం జారిపోయి యవ్వనం వచ్చినప్పుడు సంతోషంగానే ఉంటుంది. బాల్యం పోయింది అని ఎవరు బాధపడరు. యవ్వనం కాస్తా వార్థక్యంగా మారుతుంటే కొంచెం బాధపడతారు కాని, సహజమే అని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు. జారిపోయిన బాల్యం కోసం, కరిగిపోయిన యవ్వనం కోసం దుఃఖపడని వారు ముసలితనంతో వడలిపోయి, ఐదలిపోయిన శరీరాన్ని వదులుతుంటే మాత్రం బాధపడతారు. ఈ శరీరాన్ని వదిలిన జీవుడు లేదా ఆత్మ  మరొక తాజా శరీరాన్ని పొందుతాడు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు బాధ పడటానికి ఏముంది ? ఇది తెలియదా ? తెలుసు. అందరూ ఏదో ఒక సందర్భంలో ఇతరులకి చెప్పేప్పుడైనా ఈ మాటలు అంటూనే ఉంటారు. కాని, తమ దాకా వచ్చేసరికి మైకం కమ్ముతుంది. దీనినే 'మోహం' అని అంటారు. చెదరని మనసు ఉన్నవాళ్ళకి ఇటువంటి మైకం కమ్మదు.

కంటికి కనపడే పదార్థంతో పాటు యథార్థాన్ని కూడా గ్రహించగల వారికి ఈ సమస్య ఉండదు. దానికి కూడా ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు భగవానుడు. మనం ఇప్పుడున్నాము అన్నది సత్యం. అది ప్రతి వారికి తెలియటమే కాదు, అనుభవంలో ఉన్నది. కాని కనపడే ఈ సత్యం వెనుక శాశ్వత సత్యం మరొకటి ఉంది. ఈ శరీరాలు ధరించక ముందు కూడా ఉన్నాము. శరీరాలు వదిలిన తరువాత కూడా ఉంటాము. సిద్ధాంతరీత్యా తెలిసినా ఇది చర్మచక్షువులకి కనపడదు. కనుక అవగాహన కావటం, అనుభవంలోకి తెచ్చుకోవటం కష్టమవుతుంది. స్థిర చిత్తంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరుక ఉపయోగపడుతుంది. అప్పుడు మోహం ఉండదు. మొహం లేనపుడు కర్తవ్య నిర్వహణ చేయటం ఉంటుంది. ఫలితం గురించి పట్టించుకోవటం ఉండదు. ఇది కదా సుఖ జీవనానికి మూలసూత్రం.