మానసిక ప్రశాంతత కోసం శారీరక దృఢత్వం కోసం ఆరోగ్యకర జీవనశైలి కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు టీటీడీ ఈవో రవిచంద్ర.జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై శుక్రవారం ( జూన్ 5 ) తిరుమలలోని పద్మావతి అతిథి భవనంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యలు చేశారు రవిచంద్ర. జూన్ 7 నుండి 21 వరకు ప్రతిరోజూ టీటీడీ ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
యోగాభ్యాసం ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. అన్ని వయస్సుల వారిలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చేందుకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్, పతంజలి యోగపీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈవో రవిచంద్ర.
యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే యోగాపై ఆసక్తి, అవగాహన పెంపొందేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జూన్ 21న ఉదయం 6 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం వేలాది మంది పాల్గొనే యోగా అవగాహన ర్యాలీ నిర్వహించాలని సూచించారు ఈవో రవిచంద్ర.
