
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) రోజువారి కార్యకలాపాలను చూసేందుకు ఓ పర్యవేక్షణ కమిటీని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించనుంది. ఇందులో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. ఈ మేరకు శనివారం స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ సుజాత చతుర్వేది, సాయ్ డీజీ సందీప్ ప్రధాన్ రెండు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక, అవినీతి ఆరోపణలను కూడా ఈ కమిటీ విచారించనుంది. మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌ను మినిస్ట్రీ సస్పెండ్ చేసింది. అలాగే, గోండా (యూపీ)లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నీ సహా అన్ని పోటీలను రద్దు చేయాలని ఆదేశించింది. అనురాగ్‌తో మీటింగ్ తర్వాత తమ ఆందోళన విరమిస్తున్నట్టు రెజ్లర్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. కాగా, బ్రిజ్,ఫెడరేషన్‌పై రెజ్లర్లు చేసిన అన్ని ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ కొట్టి పారేసింది. రెజ్లర్లు రహస్య ఎజెండాతో పని చేస్తున్నారని ఆరోపించింది.