పండుగల శ్రావణం మొదలైంది

పండుగల శ్రావణం మొదలైంది

తెలుగు మాసాల్లో శ్రావణ మాసం ప్రత్యేకమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసమిది. ఈరోజు (ఆగస్టు 9) నుంచి శ్రావణమాసం మొదలయ్యింది. ఇవ్వాళ్టి నుంచి నెలంతా తెలుగిళ్లు పండుగ కళతో వెలిగిపోతాయి. ఎక్కువ పండుగలు వచ్చే నెల కూడా ఇదే. చాంద్రమానం ప్రకారం ఏడాదిలో ఐదో నెల శ్రావణం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత ఫలితాన్ని అందిస్తాయి. శ్రవణా నక్షత్ర ప్రవేశంతో మొదలయ్యే ఈ మాసం అంటే మహాశివుడికి కూడా అత్యంత ఇష్టమని భక్తుల నమ్మకం. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని ‘నభో మాసం’ అని కూడా అంటారు. ‘నభో’ అంటే ఆకాశం అని అర్ధం. 

ఏడాది మొత్తంలో ఈ నెలలోనే ఎక్కువగా వ్రతాలు జరుగుతాయి. ఈ నెలలో నాలుగు మంగళవారాలు మంగళగౌరీ వ్రతం, ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వీటితోపాటు నాగుల చతుర్థి, శ్రావణ (రాఖీ) పౌర్ణమి, హయగ్రీవ జయంతి, కృష్ణాష్టమి, పోలెల అమావాస్య, పుత్రదా ఏకాదాశి, కామిక ఏకాదశి, బలరామ జయంతి, గరుడ పంచమి, అఖండ దీపారాధన వంటివి ఈ నెలలోనే వస్తాయి. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

పురాణాల ప్రకారం
ఈ నెల గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు మంచిదని మత్స్యపురాణం చెబుతోంది. ప్రతి సోమవారం మహా లింగార్చన ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని కూడా పూజిస్తారు. భక్తులు మనసుతో ఆరాధిస్తే నవగ్రహాలు శాంతిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ పక్షంలోని ఒక్కో రోజు,  ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు, విదియ- -ప్రియవతి, తదియ -పార్వతీదేవి, చవితి-- వినాయకుడు, పంచమి శశి, షష్ఠి --నాగ దేవతలు, సప్తమి-- సూర్యుడు, అష్టమి- దుర్గాదేవి, నవమి -మాతృదేవతలు, దశమి --ధర్మరాజు, ఏకాదశి- -మహర్షులు, ద్వాదశి-- శ్రీమహావిష్ణువు, త్రయోదశి- -అనుంగుడు, చతుర్దశి- --పరమశివుడు, పూర్ణిమ--పితృదేవతలకు పూజలు చేస్తే ఎలాంటి సమస్యలు రావని, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పురాణాల్లో ఉంది. శ్రావణ మాసంలో కొత్త పెండ్లికూతుళ్లు ఈ వ్రతాల్ని ఆచరించడం అన్ని విధాల మంచిదని చెబుతారు.

రోగాలు రాకుండా
ఏడాది మొత్తంలో ఒక్క శ్రావణంలోనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలతో అతిసార, డయేరియా, మలేరియా వంటి అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి. 
ఆధ్యాత్మికత పేరుతో పరిసరాల పరిశుభ్రత పాటించడం, శాకాహారం తీసుకోవడం, ఉపవాసాలు చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, రోగాలు రాకుండా ఉంటాయని చెప్తారు.
::: మహాముత్తారం, వెలుగు