వేలంలోకి బొగ్గు బ్లాకులు...సెప్టెంబర్ 25 నుంచి 9 రాష్ట్రాల్లోని 25 బొగ్గు బ్లాక్లకు బిడ్లు

వేలంలోకి బొగ్గు బ్లాకులు...సెప్టెంబర్ 25 నుంచి 9 రాష్ట్రాల్లోని 25 బొగ్గు బ్లాక్లకు బిడ్లు
  • తెలంగాణలోని శ్రావణపల్లి ఓసీపీ, కోయగూడెం బ్లాక్-3ని ఆక్షన్​లో పెట్టిన కేంద్రం
  • వీటిని దక్కించుకోవడంపై సింగరేణి నజర్


కోల్​బెల్ట్, వెలుగు:కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ దేశంలోని 25 బొగ్గు బ్లాక్​లను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఆయా కంపెనీల నుంచి బిడ్ల స్వీకరణ మొదలుకానుంది. డిసెంబర్  వరకు గడువు ఉంది. 

రాష్ట్రంలోని శ్రావణపల్లి ఓసీపీ, కోయగూడెం–3 ఓసీపీ బ్లాక్​లను వేలంలో ఉంచగా, వాటిని దక్కించుకోవడానికి సింగరేణి కంపెనీ బిడ్  దాఖలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వేలం వేయనున్న గనుల్లో 21 గనుల సర్వే పూర్తి కాగా, మిగిలిన నాలుగు గనుల్లో పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 16 సార్లు వేలం నిర్వహించి 147 బ్లాకులను 44 కొత్త కంపెనీలకు కేటాయించింది. 

16వ విడత నిర్వహించే వేలంలో 9 రాష్ట్రాలకు చెందిన 25 బొగ్గు బ్లాక్​లు ఉండగా, అందులో రాష్ట్రంలోని శ్రావణపల్లి ఓసీపీ బ్లాక్, కోయగూడెం బ్లాక్–3 ఉన్నాయి. సింగరేణి కంపెనీ కోయగూడెం బ్లాక్–-3, శ్రావణపల్లి బ్లాక్​లో బొగ్గు నిల్వలను గుర్తించేందుకు రూ.కోట్లు వెచ్చించి గతంలో సర్వే చేయించింది. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో టెండర్​ దరఖాస్తులు కొనుగోలు చేసినా, ప్రభుత్వ ఆదేశాలు లేక వేలంలో పాల్గొనలేదు. 

దీంతో ఈ రెండు బొగ్గు బ్లాక్​లు ఇతర ప్రైవేట్​ కంపెనీలు దక్కించుకున్నాయి. అయితే వివిధ కారణాలతో ఆ కంపెనీలు బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టలేదు. దీంతో కేటాయింపులు రద్దు చేసి తాజాగా జరిగే వేలంలో ఈ బ్లాక్​లను చేర్చారు. రెండు బ్లాక్​లను దక్కించుకుంటే సింగరేణి సంస్థ మనుగడకు మరింత బలం చేకూరనుంది. 

సింగరేణి సంస్థకు జులైలో తాడిచర్ల-2వ బ్లాక్​ను కేంద్రం నేరుగా కేటాయించగా, ఆగస్టులో జరిగిన వేలంలో జెన్​కో పోటీ నుంచి వైదొలగడంతో మణుగూరు డిప్​సైడ్​-2వ బ్లాక్​ కూడా దక్కింది. ఇదే ఊపుతో మరిన్ని బొగ్గు బ్లాక్​లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కోయగూడెం-–3, శ్రావణపల్లి బ్లాక్​లను దక్కించుకొనేందుకు సింగరేణి తనవంతు ప్రయత్నం  చేయాలని కార్మికులు కోరుతున్నారు. 

మరోవైపు వేలంతో సంబంధం లేకుండా నేరుగా సింగరేణికి కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చొరవ చూపాలని అంటున్నారు.ఈ రెండు గనుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి రెడీ అవుతుండగా, ఇటీవల మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి శ్రావణపల్లి బ్లాక్​ విషయంలో గుడ్​న్యూస్​ చెబుతాననడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 

మందమర్రి ఏరియాకు పూర్వ వైభవం

దేశంలోని 25 బొగ్గు బ్లాక్​లను వేలంలో ఉంచగా, అందులో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటపూర్​ పంచాయతీలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్​ ఒకటి. గనిని వేలం ద్వారా దక్కించుకోవడానికి పలు కార్పొరేట్​ సంస్థలు పోటీ పడుతుండగా, రూ.కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్న తామే ఆ బ్లాక్​ను కైవసం చేసుకోవాలని సింగరేణి పట్టుదలతో ఉంది. 30 ఏండ్లుగా బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

అనేక సార్లు సర్వేలు కూడా చేసింది. మందమర్రి ఏరియాలో వరుసగా బొగ్గు గనులు మూతపడుతున్నాయి. బొగ్గు తవ్వాలని భావించినప్పటికీ శ్రావణపల్లి, కేకే–-6 బొగ్గు బ్లాక్​లు కేంద్రం పరిధిలోకి వెళ్లాయి. మరో ఏడాది గడిస్తే ప్రస్తుతం నడుస్తున్న కేకే-–5 గని కూడా మూతపడే పరిస్థితి ఉంది. ఈక్రమంలో శ్రావణపల్లి బ్లాక్​ దక్కితే మందమర్రి ఏరియాకు పూర్వవైభవం రానుంది. 

1996లో బొగ్గు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్​ పనులు చేపట్టారు. గనిలో జీ-9 గ్రేడ్​ రకం  94 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. 33ఏళ్ల పాటు గనిలో బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. గని ఏర్పాటుకు 1936 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 878 హెక్టార్లు అటవీ భూమి,1058 హెక్టర్ల  ప్రభుత్వ, ప్రైవేట్  భూములు ఉన్నాయి. శ్రావణపల్లి, జెండా వెంకటపూర్, భగీరత్​పేట, మెట్​పల్లి, నార్వాయిపేట, మందమర్రి మండలం మామిడిగట్టు, సారంగపల్లి గ్రామాలు ప్రభావితం కానున్నాయి.

కోయగూడెంలో 120 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని కోయగూడెం ఓసీపీ-–3 బొగ్గు బ్లాక్​ను కేంద్రం వేలంలో చేర్చింది. ఈ గని ఏజెన్సీ ఏరియాలో ఉంది. 2022లో ఓ ప్రైవేట్​ కంపెనీ వేలంలో దక్కించుకున్నప్పటికీ, షెడ్యూల్డ్​ ఏరియా నిబంధనల కారణంగా 2023లో ఆ టెండర్​ రద్దయింది. ఈ బ్లాక్​లో 120 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.

 ఏటా 4.8 మిలియన్  టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం​ఉంది. సింగరేణికి ఈ గని దక్కితే రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, పన్నుల రూపంలో రూ.150 కోట్లు, సింగరేణికి ఏడాదికి రూ.550 కోట్ల లాభం వస్తుందని భావిస్తున్నారు.