ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ ఊసెత్తని సర్కార్

ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ ఊసెత్తని సర్కార్
  • పనులకు జీహెచ్ఎంసీ వద్ద నిధుల్లేవ్

హైదరాబాద్, వెలుగు: ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​ మెంట్ ప్రోగ్రామ్), ఎస్ఎన్డీపీ( స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) ఫస్ట్ ఫేజ్​లతోనే ప్రభుత్వం సరిపెట్టేలా కనిపిస్తోంది. ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి కావస్తున్నా సెకండ్ ఫేజ్ మాటెత్తడం లేదు. ఇప్పటికే పనులు పూర్తయిన చోట సెకండ్ ​ఫేజ్​ పనులు స్టార్ట్​​చేయాలని అధికారులు చూస్తున్నా ప్రభుత్వం వద్ద నిధులు లేనట్లు తెలుస్తోంది. అప్పు పుడితేనే సెకండ్ ఫేజ్ పనులకు అనుమతులు లభించేలా కనిపిస్తోంది.

అప్పుల వేటలో బల్దియా..

గ్రేటర్​లో వరదల నివారణకు ఎస్ఎన్డీపీ ఫేజ్–2లో భాగంగా పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అప్పుల వేట మొదలుపెట్టింది. రూ.2 వేల కోట్లతో దాదాపు 80 నాలాల పనులు చేపట్టాలని డిసైడ్ అయిన బల్దియా అందుకు కావాల్సిన నిధుల కోసం వెతుకుతోంది. ఫేజ్–1లో భాగంగా చేపట్టిన 37 నాలాల పనులు జరుగుతున్నాయి. వీటి కోసం ఎస్​బీఐలో రూ.700 కోట్లు అప్పు తీసుకొచ్చింది. ఫస్ట్ ఫేజ్ పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తికాగా, చాలావరకు చివరి దశలో ఉన్నాయి.

ప్రపోజల్స్​ పంపి ఏడాది దాటినా..

ఎస్​ఆర్డీపీ ఫేజ్–2 పనులు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ప్రపోజల్స్​పంపి ఏడాది దాటినా ఈ విషయంపై రాష్ట్రప్రభుత్వం ఉలుకూ పలుకు లేకుండా ఉంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మొత్తం 48 పనులకు గానూ రూ.5,937 కోట్లతో 42 పనులను బల్దియా చేపట్టింది. ఇందుకు రూ.3,500 కోట్లు అప్పు చేసింది. ఈ పనుల్లో 32 పూర్తికాగా ఇంకా పది  కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే సెకండ్ ఫేజ్ కోసం రూ.4 వేల కోట్లతో 17 పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ రాష్ట్ర సర్కార్​కు ప్రతిపాదనలు పంపింది. కానీ ఆ పనులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.

ముందుకురాని బ్యాంకులు

ఫస్ట్ ఫేజ్​ పనులకే నిధుల గండం రావడంతో సెకండ్ ఫేజ్​కు అనుమతులిస్తే మళ్లీ అప్పులు దొరక్క పనులు సాగవని, అందుకే అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదని తెలుస్తోంది. అప్పుల కోసం జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తున్నా బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇప్పటికే వివిధ పనుల కోసం బల్దియా ఆయా బ్యాంకుల్లో రూ.5,275 కోట్ల అప్పులు చేసింది. వీటికి సంబంధించి ఏడాదికి రూ.400 కోట్లకుపైగా వడ్డీ చెల్లిస్తోంది. అయితే, కొత్తగా లోన్లు తీసుకునేందుకు లిమిట్ లేకపోవడంతో అప్పులు లభించడం లేదని తెలుస్తోంది. ట్రాఫిక్ జామ్ అవుతున్న చాలా ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఫేజ్​కు అనుమతులిస్తే ఈ నిర్మాణాలు జరిగి, వాహనదారులకు కొంతమేర ఇబ్బందులు తప్పుతాయి.