Beyond23 Cricket: పాత గాయాలను వెనక్కి లాగడానికి సిగ్గుండాలి.. లలిత్ మోడీ, క్లార్క్‌పై శ్రీశాంత్ భార్య ఫైర్

Beyond23 Cricket: పాత గాయాలను వెనక్కి లాగడానికి సిగ్గుండాలి.. లలిత్ మోడీ, క్లార్క్‌పై శ్రీశాంత్ భార్య ఫైర్

ఐపీఎల్ 2008 తొలి సీజన్ లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ను బహిరంగంగా చెంప దెబ్బ కొట్టడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం 18 సంవత్సరాల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ.. ప్రారంభ ఎడిషన్‌లో హర్భజన్ సింగ్-శ్రీశాంత్ మధ్య జరిగిన "స్లాప్-గేట్" వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొని వచ్చాడు.  మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. లీగ్ ప్రారంభ రోజుల్లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్ గొడవ పడిన వీడియో సీన్స్ తన వద్ద ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.  

18 ఏళ్ల నాటి ఈ సంఘటన తాజాగా వెలుగులోకి రావడంతో శ్రీశాంత్ ఫ్యామిలీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. శ్రీశాంత్ భార్య.. లలిత్   మోడీ, మైకేల్ క్లార్క్ తమ ప్రచారాల కోసం పాత గాయాలను మళ్ళీ లాగుతున్నారని ఆమె ఘాటుగా విమర్శించింది. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి శ్రీశాంత్ మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ లో ఇలా చెప్పుకొచ్చింది. "లలిత్ మోడీ, మైకేల్ క్లార్క్ లకు ఇది సిగ్గు పడాల్సిన విషయం. మీ సొంత చౌకబారు ప్రచారం, అభిప్రాయాల కోసం 2008 నాటి విషయాన్ని మీరు ఎత్తి చూపడానికి మీకు అర్హత లేదు. ఈ విషయం గురించి మాట్లాడారంటే మీకసలు కనీస మానవత్వం లేదు. 

శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరూ చాలా కాలంగా మారారు. వారు ఇప్పుడూ అంత మార్చిపోయారు. వారిద్దరికీ ఇప్పుడు స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని తిరిగి పాత గాయంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీశాంత్ తన కష్టాల తర్వాత జీవితాన్ని పునర్నిర్మించుకున్నాడు. అతని భార్యగా.. అతని పిల్లల తల్లిగా.. 18 సంవత్సరాల తర్వాత ఇలాంటి విషయాలు వినడం మా కుటుంబానికి చాలా బాధాకరం. ఇది ఆటగాళ్లను బాధించడమే కాదు, వారి అమాయక పిల్లలను గాయపరుస్తుంది. ఇది పూర్తిగా అసహ్యకరమైనది, హృదయం లేనిది, అమానుషమైనది". అని ఆమె తన పోస్ట్‌లో రాసింది.

అసలేం జరిగిందంటే..? 

ఐపీఎల్ 2008 తొలి సీజన్ లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ను బహిరంగంగా చెంప దెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (అప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్) 66 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. పంజాబ్ తరపున ఆడుతున్న శ్రీశాంత్..మ్యాచ్ గెలిచిన తర్వాత దూకుడుతో కూడిన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పటికే మ్యాచ్ ఓడిపోయామనే నిరాశలో ఉన్న హర్భజన్ కు ఈ విషయం నచ్చలేదు. ఎమోషన్స్ అదుపులో పెట్టుకోలేక శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టాడు.