త‌గ్గేదెలే: రైజ‌ర్స్ పాంచ్ ప‌టాకా..!

 త‌గ్గేదెలే: రైజ‌ర్స్ పాంచ్ ప‌టాకా..!
  • రైజర్స్ పాంచ్ 
  • లీగ్ లో వరుసగా ఐదో విజయం
  • 9 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపు
  • రెచ్చిపోయిన నటరాజన్, జాన్సెన్, అభిషేక్

ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్నా.. గతంలో ఎప్పుడూ లేనంత అద్భుతమైన బౌలింగ్‌‌తో రాణించిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. ఐపీఎల్‌‌లో సూపర్‌‌ విక్టరీ కొట్టింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 9 వికెట్ల తేడాతో రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరును చిత్తు చేసింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌ చేసిన ఆర్​సీబీ 16.1 ఓవర్లలో 68 రన్స్‌‌కే కుప్పకూలింది.  ప్రభుదేశాయ్ (15) టాప్ స్కోరర్. ఆ తర్వాత మ్యాక్స్ వెల్ (12), ఎక్స్‌‌ట్రాలదే (12) అత్యధిక స్కోరు అంటే బెంగళూరు బ్యాటింగ్ ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం ఛేజింగ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బాల్స్ లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 47), విలియమ్సన్ (16 నాటౌట్) దూకుడుగా ఆడటంతో 8 ఓవర్లలోనే 72/1 రన్స్ చేసిన హైదరాబాద్ విక్టరీ సాధించింది. జాన్సెన్‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
పెవిలియన్​కు క్యూ..
మొదట బ్యాటింగ్‌‌లో బెంగళూరు పూర్తిగా విఫలమైంది. పిచ్ సహకారాన్ని ఉపయోగించుకుంటూ సన్ రైజర్స్ బౌలర్లు విజృంభించడంతో ఆర్ సీబీ ప్లేయర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. రెండో ఓవర్లో డుప్లెసిస్​ను(5) క్లీన్ బౌల్డ్ చేసిన జాన్సెన్​... ఆర్​సీబీ వికెట్ల పతనానికి బీజం వేశాడు. ఇదే ఓవర్లో విరాట్ కోహ్లీ (0)ని గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్ పంపి, చివరి బంతికి అనూజ్ రావత్ (0)ను ఔట్ చేసి బెంగళూరు ఫ్యాన్స్ లో గుబులు రేపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (12), ప్రభుదేశాయ్ (15) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఏ దశలోనూ అపోనెంట్​కు అవకాశం ఇవ్వని రైజర్స్ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. రెండు ఫోర్లతో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన మ్యాక్సీని ఐదో ఓవర్లో నటరాజన్ పెవిలియన్ పంపాడు. ఇక 9వ ఓవర్లో సుచిత్‌‌...  ప్రభుదేశాయ్, కార్తీక్ (0)లను ఔట్ చేయగా.. తర్వాతి ఓవర్లో షాబాజ్ అహ్మద్ (7) కూడా వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లకు 49/7తో ఆర్‌‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. హర్షల్ పటేల్ (4), హసరంగ (8)లను తన వరుస ఓవర్లలో నటరాజన్  క్లీన్ బౌల్డ్ చేయగా.. తర్వాతి ఓవర్లో సిరాజ్ ను (2) ఔట్ చేసిన భువనేశ్వర్.. బెంగళూరును 68 రన్స్‌‌కు పరిమితం చేశాడు. ఈ సీజన్ లో ఇదే అత్యల్ప స్కోరు. 
ప్రపంచ స్థాయి స్టార్లు లేకపోయినా.. ఐపీఎల్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ అద్భుతంగా పుంజుకున్నది..! స్టార్టింగ్‌‌లో ఘోరంగా విఫలమైన రైజర్స్‌‌ బౌలర్లు.. ఇప్పుడు తడాఖా చూపెడుతున్నారు..! మార్కో జాన్సెన్‌‌ (3/25), నటరాజన్‌‌ (3/10) సూపర్‌‌ బౌలింగ్‌‌తో.. బలమైన బెంగళూరుకు చెక్‌‌ పెట్టారు..! ఫలితంగా చిన్న టార్గెట్‌‌ను ఈజీగా ఛేదించిన హైదరాబాద్‌‌.. ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌‌కు చేరింది..! ఇన్నింగ్స్‌‌ మొత్తంలో 9 మంది సింగిల్‌‌ డిజిట్‌‌ స్కోరుకే పరిమితం కావడంతో ఆర్‌‌సీబీకి ఓటమి తప్పలేదు..!
ఓపెనర్ల దూకుడుతో
స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కేన్​ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఏమాత్రం ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారు. రెండో ఓవర్లో ఫోర్ తో బౌండ్రీల ఖాతా తెరిచిన అభిషేక్ తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్ తో దూకుడు చూపించాడు. అతడికి విలియమ్సన్ సపోర్ట్ ఇవ్వడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. నాలుగు, ఐదు ఓవర్లలో రెండేసి ఫోర్లు సాధించిన అభిషేక్.. హేజిల్‌‌వుడ్‌‌ తర్వాతి ఓవర్లోను మూడు ఫోర్లు కొట్టి స్కోరు ను 50 దాటించాడు. ఇదే ఊపును కొనసాగించి మ్యాచ్‌‌ను ముగిస్తాడనుకున్న అభిషేక్ ను హర్షల్ పెవిలియన్ పంపి ఆర్‌‌సీబీకి బ్రేక్ ఇచ్చాడు. అప్పటికి రైజర్స్​కు కేవలం 5 రన్స్ మాత్రమే అవసరం. ఈ దశలో ఎదుర్కొన్న మూడో బంతినే సిక్స్ బాదిన రాహుల్ త్రిపాఠి (7 నాటౌట్) రైజర్స్ కు 8 ఓవర్లలోనే విక్టరీని అందించాడు. 
స్కోరు బోర్డు
బెంగళూరు: డుప్లెసిస్ (బి) జాన్సెన్ 5, అనూజ్ రావత్ (సి)మార్ క్రమ్ (బి) జాన్సెన్ 0, కోహ్లీ (బి) జాన్సెన్ (0), మ్యాక్స్ వెల్ (సి) విలియమ్సన్ (బి) నటరాజన్ 12, ప్రభుదేశాయ్ (స్టంప్) పూరన్ (బి) సుచిత్ 15, షాబాజ్ (సి) పూరన్ (బి)  ఉమ్రాన్ 7, కార్తీక్ (సి) పూరన్ (బి) సుచిత్ 0, హర్షల్ పటేల్ (బి) నటరాజన్ 4, హసరంగ (బి) నటరాజన్ 8, సిరాజ్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 2, హేజిల్ వుడ్ నాటౌట్ 3;

ఎక్స్ ట్రాలు: 12, మొత్తం : 16.1 ఓవర్లలో 68 ఆలౌట్​.

వికెట్ల పతనం: 1–5, 2–5, 3–8, 4–20, 5–47, 6–47, 7–49, 8–55, 9–65, 10–68.  బౌలింగ్: భువనేశ్వర్ 2.1–0–8–1, జాన్సెన్ 4–0–25–3, నటరాజన్ 3–0–10–3, సుచిత్ 3–0–12–2, ఉమ్రాన్ మాలిక్ 4–0–13–1. 
హైదరాబాద్: అభిషేక్ వర్మ (సి) అనూజ్ రావత్ (బి) హర్షల్ పటేల్ 47, విలియమ్సన్ (నాటౌట్) 16, రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 7, ఎక్స్ ట్రాలు: 2,  మొత్తం: 8 ఓవర్లలో 72/1. వికెట్ల పతనం: 1–64. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0, హేజిల్ వుడ్ 3–0–31–0, హర్షల్ పటేల్ 2–‌‌‌‌0–18–1, హసరంగ 1–0–7–0.