
శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలిస్తున్న రోజులవి. సాహితీసమరాంగణ చక్రవర్తిగా పేరెన్నికగన్న శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఉన్న కవులను, కళాకారులను ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు అడిగేవాడు. ఆ సమస్యలకు తృప్తిగా ఉన్న జవాబును పొందాక వాళ్లను సన్మానించేవాడు. ఇది రాయల కొలువులో నిత్య కృత్యం. అలాంటి కృష్ణదేవరాయలకు ఒకసారి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప వస్తువు ఏది? అన్నది తెలుసుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే దండోరా వేయించాడు. దేశం నలుమూలల నుంచి అనేకమంది వివిధరకాల బొమ్మలు తీసుకొచ్చారు.
అక్కడకు వచ్చినవారిలో ఒక వ్యక్తి తెచ్చిన వస్తువు అందరినీ ఆకర్షించింది. ఆ వ్యక్తి చేతిలో ఒక నాలుక బొమ్మ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు అతని వంక విచిత్రంగా చూశాడు. అతను రాజు వంక చూసి, ‘‘ప్రపంచంలో అన్నిటికైనా అతి విలువైనది, అతి గొప్పది నాలుక” అంటూ నాలుక బొమ్మని ప్రదర్శించాడు. సభలోనివారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఎన్నో విలువైన వస్తువులు, వజ్రవైడూర్యాలు ఉండగా, ఈ నాలుక బొమ్మ ఎలా గొప్పదవుతుందనే కుతూహలం కలిగిన రాజు, ‘‘నీ పేరు ఏంటి?” అని అడిగాడు.
‘‘నా పేరు గోపన్న. మీ కీర్తి ప్రపంచం నలుమూలల చంద్రకాంతిలా వెదజల్లుతోంది. మీ రాజ్యంలో ప్రజలంతా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. మీ ఖ్యాతి ఇంత.. అంత... అని చెప్పలేం. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని వచ్చా..’’ అంటూ తన పరిచయం చేసుకున్నాడు గోపన్న.
రాజు చాలా సంతోషించి, ‘‘ఎందువల్ల నాలుకే గొప్పదని నీకు అనిపించిందో వివరించు. ఇన్ని అందమైన, విలువైన వస్తువుల కన్నా ఈ నాలుకే గొప్పదని నువ్వు రుజువు చేయగలవా?” అని నిలదీశాడు రాయలు.
‘‘మహారాజా! ఈ ప్రపంచంలో ఎవరిని జయించాలన్నా, ఎదుటివారిని పొగడాలన్నా, అందాలను వర్ణించాలన్నా నాలుకతోనే సాధ్యం. ఒక మనిషి గొప్పతనాన్ని చెప్పాలన్నా, ఒక పదార్థాన్ని తిన్నాక దాని రుచిని చెప్పాన్నా, ఒక వస్త్రాన్ని చూసినప్పుడు దాని అందం వర్ణించాలన్నా, ఒక సౌందర్యవతిని చూసినప్పుడు లేదా ధైర్య సాహసాలు గల పురుషుని చూసినప్పుడు వర్ణించాలన్నా తప్పనిసరిగా నాలుక అవసరం. నాలుక పని చేయకపోతే మనం మాట్లాడలేం. ఇక్కడున్న అన్ని వస్తువుల గొప్పతనాన్ని చెప్పగలిగిన సామర్థ్యం కేవలం నాలుకకే ఉంది..’’ అన్నాడు.
రాజు చాలా సంతోషించి తను ఇవ్వదలుచుకున్న బహుమతిని గోపన్నకు ఇచ్చి పంపించాడు. శ్రీకృష్ణదేవరాయలకి ..ఈసారి ప్రపంచంలో అన్నిటికన్నా అతి చెడ్డది ఏదో తెలుసుకోవాలనే మరో కోరిక పుట్టింది. మళ్లీ ప్రకటన ఇచ్చాడు. ప్రజలంతా రకరకాల చెడ్డ వస్తువులతో రాజుగారి ముందుకు వచ్చారు. వాటిల్లో నాగుపాము లాంటి క్రూర జంతువులు, తేళ్లు, దొంగలు, మంత్రగత్తెల్లాంటి అనేక వస్తువులు ఆయన ముందు ఉంచారు. ఈ ఏడాది కూడా గోపన్న నాలుకతోనే మళ్ళీ వచ్చాడు. గోపన్నను చూసిన శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యంగా ‘‘అదేంటి గోపన్నా! కిందటిసారి పోటీ పెట్టినప్పుడు అన్నిటికన్నా అతి గొప్పది నాలుక అన్నావు. బహుమతి కూడా పొందావు. మరి ఈ ఏడాది ‘అన్నిటికన్నా అతి చెడ్డది’ అని అడిగినప్పుడు కూడా నువ్వు అదే నాలుకను ఎందుకు తీసుకొచ్చావు? ” అని ప్రశ్నించాడు. అప్పుడు గోపన్న...‘‘మహారాజా ఒక పని సానుకూలపడాలన్నా, ఒకరిని పొగడాలన్నా నాలుక ఎంత ముఖ్యమో, ఒకరిని తిట్టాలన్నా, పని చెడగొట్టాలన్నా కూడా నాలుక అంతే ముఖ్యం’’ అని వివరించాడు.
‘‘ఒక కత్తితో నిర్మాణాత్మక పనులు చేయొచ్చు. అదే కత్తితో విధ్వంసాలూ సృష్టించొచ్చు. మహాభారతంలో కౌరవపాండవుల మధ్య సంధి కుదర్చడానికి అనేక రాయబారాలు జరిగాయి. ద్రుపద పురోహితుడు ముందుగా రాయబారం నడిపాడు. ఆ తరువాత సంజయుడు రాయబారం చేశాడు. శకుని కుమారుడు ఉలూకుడు నడిపిన రాయబారం అన్నిటికన్నా అతి నీచమైనది. పనిని సానుకూల పడకుండా చేయగలిగినవాడు ఉలూకుడు. చివరగా శ్రీకృష్ణుడు రాయబారం చేశాడు. ఇన్ని రాయబారాలలోనూ ఒకే నాలుక పనిచేసింది. శకుని కొడుకు చేసిన రాయబారం వల్ల యుద్ధం సంభవించింది. శ్రీకృష్ణ పరమాత్మ చేసిన రాయబారం మనసుకి ఊరట కలిగించింది. కనుక నాలుక అన్నిటికన్నా చెడ్డది, నాలుకే అన్నిటికన్నా గొప్పది’’ అని వివరణ ఇచ్చాడు ఆ వివరణతో తృప్తి చెందాడు శ్రీకృష్ణదేవరాయలు. గోపన్నకి బహుమతి ఇచ్చి పంపాడు. శ్రీమద్రామాయణంలో సైతం రాయబారం నడిచింది. అంగదుడు మంచిమాటలు చెప్పాడు. విభీషణుడు కూడా మంచి మాటలు చెప్పాడు. ఇవన్నీ నాలుకతోనే సాధ్యపడ్డాయి. అంటే నాలుకను అదుపులో పెట్టుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనే కదా అర్థం.
- డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232