కాళేశ్వరంలో పుష్కరశోభ.. మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు

కాళేశ్వరంలో పుష్కరశోభ.. మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు రెడీ అవుతోంది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కాళేశ్వరంలో మే 15 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మానవాళికి మహోపకారిగా, మోక్ష ప్రదాయినిగా నిలుస్తున్న పవిత్ర సరస్వతీనది పుష్కరశోభను సంతరించుకుంటోంది. బృహస్పతి...  మిధున రాశిలో ప్రవేశంతో అంతర్వాహిని అయిన సరస్వతీనది పుష్కరాలు ఆరంభం కానున్నాయి. 

సరస్వతి నది పుష్కరాలు        

సరస్వతీనది - పుష్కరదీప్తి :  నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తొంది.  జీవరాశులకు  నీటి ఆవస్యకత..  ప్రాముఖ్యతను  పుష్కరాలు గుర్తు చేస్తాయి. 

 ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు 12  రోజులపాటు సరస్వతీనది పుష్కరాలు  వైభవంగి జరుగనున్నాయి . ఈ సమయంలో సరస్వతి నదితీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు, ప్రస్తుతం సరస్వతి నది పుష్కరాలకు సిద్దమవుతుంది.  తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతినదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు సిద్దమవుతున్నారు. 

ఈ పుష్కరాలు కాళేశ్వరం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది.  టెంపుల్ టూరిజంపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తిని కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది.  భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.  

 సరస్వతి నది పుష్కరాలు జరిగే ప్రదేశాలు

తెలంగాణా రాష్ట్రంలోని కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలోను సరస్వతీనదీ పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీనది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని "మన" అనే గ్రామంలో పుట్టింది. అయితే ఈ నది అంతర్వాహిని. అందువల్ల సరస్వతి నదీ పుష్కరాలు "మన" లో జరుగుతాయి.   తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.  నదిలో సమృద్ధిగా నీళ్లు ఉండి, పుష్కరాలు విజయవంతంగా జరగేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలోను, రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లోను, గుజరాత్  రాష్ట్రంలోని సోమనాథ్ త్రివేణి సంగమంలోను జరుగుతాయి.