
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని ఈదమ్మ గుడి నుంచి రామస్వామి గుడి వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టారు. మదనాపురం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్లు కొట్టారు. అనంతరం అన్నదానం చేపట్టారు. పెబ్బేరులో ప్రబోధ సేవాసమితి, హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పూజలు, భగవద్గీత పఠనం చేశారు.
పట్టణంలోని పురవీధుల గుండా శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్యులు గోకులాష్టమి వేడుకలు నిర్వహించారు. పెంట్లవెల్లి మండలం గోపాలపురంలో శ్రీకృష్ణుని విగ్రహానికి ఊరేగింపు చేపట్టారు. చిన్నారులు కోలాటం ఆడారు. గద్వాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లలు శ్రీకృష్ణుడు, గోపికలు, గోపాలుర వేషధారణలో సందడి చేశారు. - వెలుగు, నెట్వర్క్