అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు

అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రజాగ్రహానికి గురైంది. అధ్యక్ష భవనాన్ని లక్షలాది మంది ప్రజలు ముట్టడించారు. గో గొటబాయ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో వందలాది మంది శ్రీలంక పౌరులు గాయపడ్డారు. ర్యాలీ దృష్ట్యా శ్రీలంక వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. చమురు, తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో అధ్యక్ష భవనం ముట్టడికి పౌరసంఘాలు పిలుపునిచ్చాయి. కొలంబోలో SJB MP Rajitha Senaratne పైకి నిరసన కారులు దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. అక్కడున్న భద్రతా సిబ్బంది ఆయన్ను సురక్షితంగా తీసుకెళ్లారు. 

విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దీంతో వేలాది మంది ప్రజలు రైళ్లు, రోడ్డు మార్గంలో అధ్యక్షభవనానికి చేరుకున్నారు. కర్ఫ్యూని లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు ప్రజలు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని గత కొంత కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హింసాత్మక ఘటనలు చెలరేగకుండా.. సైన్యానికి అధికారమిచ్చింది శ్రీలంక ప్రభుత్వం. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీలో ఉన్నట్లు ఆదేశ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చడంతో ప్రజాందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో గొటబాయ రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద ఇంటిని నిరసనకారులు చుట్టుముట్టడంతో.. ఆయన ఇలానే పారిపోయారు.