క్రూడాయిల్​ కొనుక్కోవాలె అప్పివ్వండి

క్రూడాయిల్​ కొనుక్కోవాలె అప్పివ్వండి

కొలంబో: కరోనా ఎఫెక్ట్​తో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.. విదేశీ మారక నిల్వలు అడుగంటినయ్.. క్రూడాయిల్​ కొనడానికి డాలర్లు లేక అప్పు కోసం ప్రయత్నిస్తోంది. 500 మిలియన్ల అమెరికన్​ డాలర్లు లోన్​గా ఇవ్వాలంటూ మన దేశాన్ని అడిగింది. ఇందులో భాగంగా మన హై కమిషన్​తో శ్రీలంక అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. దేశంలో ఇంధన వనరులు నిండుకుంటున్నయని శ్రీలంక ఎనర్జీ మినిస్టర్​ కొన్ని రోజుల కిందటే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి క్రూడాయిల్​ కొనుగోలు ప్రయత్నాలు మొదలెట్టింది. సింగపూర్​ సహా దక్షిణాసియా దేశాల నుంచి శ్రీలంక క్రూడ్, రిఫైన్డ్​ ప్రొడక్టులను కొని, ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా డాలర్లలో చెల్లింపులు చేస్తుంది. అయితే, కరోనా వల్ల పర్యాటక రంగం దెబ్బతిని ప్రభుత్వానికి ఆదాయం కుంటుపడింది. దీని ఎఫెక్ట్​తో దేశంలో విదేశీ మారకనిల్వలు తగ్గిపోయినయ్. ఆర్థిక సంక్షోభం వల్ల డాలర్​తో శ్రీలంక రూపాయి విలువ 9 శాతం పడిపోయింది. ఫలితంగా డాలర్ మరింత ప్రియంగా మారి, క్రూడాయిల్​ బడ్జెట్​ను పెంచింది. మరోవైపు, క్రూడాయిల్​ కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వరంగంలోని సిలోన్​ పెట్రోలియం కార్పొరేషన్(సీపీసీ) భారీ మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయింది. సిలోన్ బ్యాంకు, పీపుల్స్ బ్యాంకులకు ఇప్పటికే 3.3 బిలియన్ల అమెరికా డాలర్లు బకాయిపడ్డది. ఈ పరిణామాలతో ఇండియా నుంచి అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్​ హైకమిషన్​తో సీపీసీ అధికారులు భేటీ అయ్యారు. ఇండియా శ్రీలంక ఎకనామిక్​ పార్ట్​నర్​షిప్​ అరేంజ్​మెంట్​ కింద 500 మిలియన్ల అమెరికన్​ డాలర్లు అప్పుగా తీసుకోనున్నట్లు సీపీసీ చైర్మన్​ సుమిత్​ విజెసింఘె చెప్పారు. త్వరలోనే రెండు దేశాల ఎనర్జీ సెక్రటరీలు దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని ఆయన వివరించారు.