హమ్మయ్య శ్రీలంక బతికిపోయింది: నిషేధం ఎత్తివేసిన ఐసీసీ.. కానీ ఆ ఒక్క విషయంలో నిరాశ

హమ్మయ్య శ్రీలంక బతికిపోయింది: నిషేధం ఎత్తివేసిన ఐసీసీ.. కానీ ఆ ఒక్క విషయంలో నిరాశ

వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ నిషేదించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సస్పెన్షన్ ఎత్తి వేసే వరకూ లంకేయులు ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేది లేదని సూచన ప్రాయంగా చెప్పేసింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం శ్రీలంక  క్రికెట్ బోర్డును షాక్ కు గురి చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న లంక క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం కారణంగానే బోర్డును సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో నిర్వహించాల్సిన U-19, 2024 ప్రపంచ కప్‌ దక్షిణాఫ్రికాకు వేదికగా జరపనున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

నిషేధం కారణంగా శ్రీలంక క్రికెట్ లో పునరాగమనం కష్టమే అనుకున్నారు. కానీ ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డ్ కు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ జట్టుపై నిషేధం ఎత్తివేస్తూ లంక క్రికెట్ లో సంతోషాన్ని నింపింది. ద్వైపాక్షిక మ్యాచ్‌లు, ఐసీసీ ఈవెంట్‌లలో ఆడేందుకు లంక జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని నిబంధనలకు లోబడి ఎస్‌ఎల్‌సీ నడుచుకోవాలని ఐసీసీ తెలియజేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు నుండి వచ్చే నిధులపై  ఐసీసీ నియంత్రణ ఉంటుందని  స్పష్టం చేసింది. ప్రభుత్వ జోక్యం  కూడా  ఉండకూడదని  తేల్చి చెప్పింది. 

ఈ నిర్ణయంతో లంకేయులు మళ్ళీ క్రికెట్ లోకి కొనసాగనుంది. మంగళవారం  అహ్మదాబాద్‌ వేదికగా  ముగిసిన బోర్డు సమావేశం అనంతరం  ఐసీసీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. వన్డే వరల్డ్ కప్ లో భారత్ పై 302 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత లంక క్రీడా మంత్రి బోర్డు సభ్యులపై వేటు వేయడంతో శ్రీలంకకు ఈ దుస్థితి వచ్చింది.