స్వదేశానికి తిరిగొచ్చిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు

స్వదేశానికి తిరిగొచ్చిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు

ఆర్థిక సంక్షోభానికి కారకుడై దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స స్వదేశానికి చేరుకున్నారు. ఏడు వారాల క్రితం దేశం విడిచి వెళ్లిన ఆయన శుక్రవారం తిరిగి వచ్చారు. శ్రీలంకకు తిరిగివచ్చిన గొటబయకు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు ఎయిర్ పోర్ట్ వద్ద ఘన స్వాగతం పలికారు. రాజపక్స విమానం నుంచి బయట అడుగుపెట్టగానే కొందరు పూల దండలతో పరిగెత్తుకుని వచ్చినట్లు ఎయిర్ పోర్టు అధికారి ఒకరు తెలిపారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ప్రజాందోళనల నేపథ్యంలో గొటబయ రాజపక్స జులై నెలలో మిలటరీ సాయంతో దేశం విడిచి పారిపోయాడు. తొలుత సింగ‌పూర్కు ఆ తర్వాత థాయిలాండ్ కు వెళ్లిన గోట‌బ‌య అక్కడ నుంచి రాజీనామా లేఖ‌ పంపారు. 52 రోజుల పాటు దేశానికి దూరంగా ఉన్న గోట‌బ‌య బ్యాంగ్‌కాక్ నుంచి సింగ‌పూర్ మీదుగా ఓ కమర్షియల్ ఫ్లైట్లో లంకకు తిరిగివచ్చారు. ఇంతకాలం ఆయ‌న ఓ థాయిలాండ్ హోట‌ల్‌లో ఉన్నారు. రాజపక్స స్వదేశానికి తిరిగి రావడంతో ఆయన కోసం ఆర్మీ, పోలీస్ కమాండోలతో కూడిన ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.