శ్రీలంకలో సంక్షోభం: లీటర్ పాలు రూ.1100.. గ్యాస్ రూ.2657

శ్రీలంకలో సంక్షోభం: లీటర్ పాలు రూ.1100.. గ్యాస్ రూ.2657

ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. నిత్యావసరాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడంతో... సరుకుల ధరలు చుక్కలనంటాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రెండు రోజుల్లోనే ఏకంగా 90 శాతం పెరిగి 2 వేల 657కు చేరింది. లీటర్ పాల ధర ఐదింతలు పెరిగి 11 వందల 95 అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్న కాస్త విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిషేధంతో వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. 

అక్రమ నిల్వలు బయటకు తెచ్చేందుకు శ్రీలంక అధ్యక్షుడు... రాజపక్సే.. గత గురువారం కేబినెట్ సమావేశంలో ధరలపై నియంత్రణ ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజే ధరలపై నియంత్రణ ఎత్తేశారు. 4 రోజుల్లోనే  నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో.. ధరలపై నియంత్రణ విధిస్తూ.. అత్యవసర నిబంధనలు అమల్లోకి తెచ్చారు.