రుణాలు ఎగ్గొట్టిన శ్రీలంక..!

రుణాలు ఎగ్గొట్టిన శ్రీలంక..!

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసింది. శ్రీలంక చెల్లించాల్సిన 78 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్ పీరియడ్ కూడా బుధవారంతోనే ముగిసిపోయింది. దీంతో అధికారికంగా రుణం ఎగ్గొట్టినట్లైంది. దీన్ని నిన్న రెండు క్రెడిట్ ఏజెన్సీలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం దేశం ముందస్తు దివాలలో ఉందన్నారు శ్రీలంక రిజర్వు బ్యాంక్ గవర్నర్ నందలాల్. రుణాలు పునర్ వ్యవస్థీకరించే వరకు చెల్లింపులు చేయలేమన్నారు. దీన్నే ముందస్తు దివాలా అంటామని... వారి వైపు నుంచి ఎగవేతగా భావిస్తారన్నారు నందలాల్.

శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన బెయిల్ ఔట్ పై అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు వచ్చే మంగళవారానికి పూర్తి కావచ్చన్నారు ఐఎంఎఫ్ ప్రతినిధి. ఈ ఏడాది దేశాన్ని నడిపేందుకు 4 మిలియన్ డాలర్లు కావాలని చెబుతోంది శ్రీలంక ప్రభుత్వం.

శ్రీలంక 50 బిలియన్ డాలర్ల విలువైన రుణాలు చెల్లించేందుకు వీలు కల్పించాలని రుణదాతలను కోరుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనితో పాటు విదేశీ మారక ద్రవ్యం కొరత, ద్రవ్యోల్బణంలో పెరుగుదల కారణంగా మెడిసన్, ఇంధన కొరత ఏర్పడింది.