శ్రీలంకలో సంచలనం

శ్రీలంకలో సంచలనం

శ్రీలంకలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని పదవికి రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని పార్టీ నేతలు కోరిన నేపథ్యంలో విక్రమ సింఘే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కొలంబోలోని తన నివాసం నుంచి పరారయ్యారు. నిరసనకారులు గొటబాయ ఇంటిని చుట్టుముట్టడంతో.. ఆయన పారిపోయారు. రాజపక్స రాజీనామా చేయాలని గత కొంత కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. రాజపక్స నివాసానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇంట్లోకి వెళ్లిన నిరసన కారులు స్విమ్మింగ్ పూలో ఈత కొట్టారు. అక్కడున్న ఆహార పదార్థాలను టేస్ట్ చూశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొటబాయ నివాసంలోకి చొచ్చుకపోకుండా సైన్యం గాల్లోకి కాల్పులు జరిపింది. కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. 

ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. ఈ సంక్షోభానికి రాజపక్సే విధానాలు, ఆయన కుటుంబీకులే కారణమంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే నియమితులయ్యారు. దేశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ఐదు సార్లు ప్రధానిగా చేసి ఉన్నందున పరిస్థితిని అదుపులోకి తెస్తారని శ్రీలంక ప్రజలు ఆశించారు. కానీ..అలాంటిదేమీ జరగలేదు. పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఎప్పుడు చూడని సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆహారం, వనరుల కొరత వేధిస్తోంది. విదేశీ మారక ద్రవ్యాలు అడుగంటిపోతున్నాయి. పీకల్లోతు అప్పుల్లో ప్రభుత్వం కూరుకపోయింది. మహిందా రాజపక్సే అసమర్థత పాలనే కారణమంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.