మురుఘా మఠాధిపతి శివమూర్తి శరణు అరెస్ట్‌ 

మురుఘా మఠాధిపతి శివమూర్తి శరణు అరెస్ట్‌ 

కర్నాటకలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో శ్రీ మురుఘా మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును చిత్రదుర్గ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఆరు రోజుల తర్వాత శివమూర్తి శరణును అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి చిత్రదుర్గలోని మురుఘా మఠం ఆవరణలో ఆయన్ను చిత్రదుర్గ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అరెస్ట్‌ చేసి, వైద్య పరీక్షలకు తరలించారు. విచారణ నిమిత్తం శివమూర్తి శరణును అరెస్ట్‌ చేసినట్లు చిత్రదుర్గం ఎస్పీ కె.పరశురామ స్పష్టం చేశారు. 

శివమూర్తి మురుగ శరణారావు స్వామీజీ 2019 నుంచి 2022 వరకు లైంగికంగా తమను వేధించినట్లు శ్రీ మురుఘా హాస్టల్‌లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్‌ విద్యార్థినులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన మైసూరులో ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ కేసును చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా శివమూర్తి శరణు, మురుఘా మఠం పాలనాధికారి, మరో ముగ్గురు సిబ్బందిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు  పారిపోయే అవకాశాలున్న కారణంగా లుక్‌ ఔట్‌ నోటీసులు కూడా జారీ చేశారు.

మరోవైపు శివమూర్తి శరణు దరఖాస్తు చేసుకున్న బెయిల్‌ పిటీషన్‌పై గురువారం ప్రారంభమైన విచారణ ఇవాళ్టికి వాయిదా వేశారు. బాధితులకు శిశు సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ), జాతీయ మానవ హక్కుల సమితి అండగా నిలిచింది. బాధితుల్లో ఒకరు దళిత వర్గానికి చెందిన వారు కావటంతో నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. మరోవైపు మఠం పరిపాలనాధికారి బసవరాజన్‌ (మాజీ ఎమ్మెల్యే)ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.

14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధింపు
మరోవైపు శివమూర్తి శరణు ఛాతీ నొప్పితో బాధపడుతుండడంతో చిత్రదుర్గ జిల్లా జైలు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.