- పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు
- తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి పోటెత్తిన భక్తులు
- రామ నామస్మరణతో మార్మోగిన భద్రాద్రి
- నేడు శ్రీరామ పట్టాభిషేకం.. గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా రాక
భద్రాచలం, వెలుగు:భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. మిథిలా మండపంలో శ్రీరామ జయరామ జయజయ రామా అంటూ భక్త జనకోటి జయజయ ధ్వానాల మధ్య దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడు, జనకుని కుమార్తె సీతమ్మ కల్యాణం వైభవోపేతంగా సాగింది. దశరథుడు, జనకుడితోపాటు భక్తజనం తరఫున భక్తరామదాసు చేయించిన మూడు సూత్రాలతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తజన కోటి కనులారా వీక్షిస్తుండగా సీతమ్మవారికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‍లగ్నం సమీపించగానే మాంగళ్యధారణ జరిగింది. కల్యాణ తంతును తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో భద్రాద్రి పులకించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
సుప్రభాత సేవతో మొదలు..
తెల్లవారు జామున 2 గంటలకే ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళశాసనం, గర్భగుడిలో అభిషేకం నిర్వహించారు. ధృవమూర్తులకు వైభవంగా కల్యాణం చేశారు. ఈ తంతుకు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, ఈవో దామోదర్‌రావు తదితరులు హాజరయ్యారు.
అనంతరం కల్యాణమూర్తులను పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు నడుమ మిథిలాస్టేడియం ప్రాంగణానికి ఊరేగింపుగా చేరుకున్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. ముందుగా తిరువారాధన, విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి.. మండప శుద్ధి చేశారు. ఈ సమయంలో మంత్రాన్ని జపిస్తూ వేదపండితులు సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు. భక్తరామదాసు చేయించిన పచ్చల, చింతాకు పతకాలు రామమాడ రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణస్వామికి ధరింప చేయడంతో మరింత శోభ సంతరించుకున్నది. సీతారాములకు శ్రీరంగం, తిరుమల తిరుపతి, శృంగేరీపీఠం, జీయర్ మఠం, గణపతి సచ్చిదానంద స్వామి, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసులు పట్టువస్త్రాలు సమర్పించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పట్టువస్త్రాలు, వెండిపళ్లెం, సింగర్ రామాచారి పట్టువస్త్రాలు అందజేశారు. భద్రాద్రి రాముడి కల్యాణ వైభవ ప్రాశస్త్యంతోపాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను దేవస్థానం వేదపండితులు స్థానాచార్యులు స్థలసాయి, రామాయణ పారాయణదారుడు ఎస్టీజీ కృష్ణమాచార్యులు వివరించారు. అభిజిత్‍లగ్నంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని విశిష్టతను వివరిస్తూ ఉత్సవమూర్తుల శిరస్సుపై ఉంచారు. దశరథుడు, జనకమహారాజు, భక్తుల తరఫున భక్తరామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలతో సూత్రధారణ కనులపండువగా నిర్వహించారు. భాగవోత్తముల ఆశీర్వచనంతో కల్యాణం ముగిసింది. తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు భద్రాద్రికి పోటెత్తారు. కరకట్ట, ఆలయ ప్రాంగణం, బస్టాండ్ల నుంచి భక్తులు కల్యాణ మండపానికి చీమల దండును తలపించేలా తరలివచ్చారు. స్టేడియంలో 32వేల మందితోపాటు బయట పక్క ఎల్ఈడీ టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చాలామంది భక్తులు కల్యాణాన్ని వీక్షించారు.
హాజరైన ప్రముఖులు
శ్రీ సీతారాముల కల్యాణం వీక్షించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ఠ, ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎంపీలు పోరిక బలరాం నాయక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, దైవజ్ఞశర్మ, కనుమూరి బాపిరాజు తదితరులు వచ్చారు.
నేడు భద్రాద్రికి గవర్నర్
భద్రాద్రికి రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా శనివారం రానున్నారు. మిథిలాస్టేడియంలో కల్యాణ సీతారాముడికి జరిగే మహాపట్టాభిషేకంలో ఆయన పాల్గొని, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆయన రాక సందర్భంగా భద్రాచలంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పుష్కరాల నాటికి తొలిదశ పనులు పూర్తి: కొండా సురేఖ
గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం రామాలయ విస్తరణ తొలిదశ పనులు పూర్తి చేస్తామని ఎండో మెంట్ మినిస్టర్ కొండా సురేఖ తెలిపారు. సీతారాముల కల్యాణం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వరుసగా మూడో సంవత్సరం కల్యాణ వేడుకలకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే డిప్యూటీ సీఎం, లోకల్ మినిస్టర్ల సహకారంతో రేవంత్‌రెడ్డి భూసేకరణ పూర్తి చేశారన్నారు. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది ఆగస్టు నెలలో జరుగుతున్నందున.. ఆ లోగా రూ.351 కోట్లతో పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. రెండో విడత పనులు కృష్ణా పుష్కరాల కల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు.
భద్రాచలం రామాలయం విస్తరణకు శంకుస్థాపన
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామాలయం విస్తరణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.351 కోట్లతో తొలి విడతగా చేపట్టబోయే పనులకు భూమి పూజ నిర్వహించారు. రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ డెవలప్‌మెంట్, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
