వైభవంగా భద్రాద్రి రాములోరి కళ్యాణం

వైభవంగా భద్రాద్రి రాములోరి కళ్యాణం

భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథులా స్టేడియంలో సీతారాముల కల్యాణ వేడుకను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణాన్ని వేద పండితులు జరిపించారు.  సీతారాములవారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు.  రామదాసు చేయించిన ఆభరణాలు.. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు  చింతాకు పతకంతో అలంకరించారు. భద్రాద్రిరాములోరికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.  రాములోరి కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణంను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పొటెత్తారు.  భద్రాచలం వీధులన్నీ  శ్రీరామనామస్మరణతో మార్మోగాయి. 

భక్తుల కోసం 234 ఆర్టీసీ బస్సులు

భక్తుల కోసం ఆర్టీసీ అన్ని రూట్లలో 234 బస్సులను నడుపుతున్నది. ఏపీ నుంచి మరో 172 బస్సులు రానున్నాయి. భద్రాచలం టు హైదరాబాద్​కు నేరుగా బస్సులను ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు ఎక్కువగా సర్వీసులు నడుస్తున్నాయి. బయట ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలకు బ్రిడ్జి పాయింట్, మార్కెట్ కమిటీ ప్రాంగణం, జూనియర్  కాలేజీ క్రీడా మైదానాల్లో పార్కింగ్​ ఏర్పాటు చేశారు. అక్కడ మరుగుదొడ్లు, తాగునీటి వసతిని సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

తలంబ్రాలు, ప్రసాదాలకు కౌంటర్లు

శ్రీరామనవమి వేడుకకు వచ్చే భక్తుల కోసం తలంబ్రాలు, ప్రసాదాలను అందించేందుకు 80 స్పెషల్​ కౌంటర్లను ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఐదు లక్షల తలంబ్రాల ప్యాకెట్లు, మూడు లక్షల లడ్డూలు తయారు చేశారు. భక్తులకు ఉచితంగా తలంబ్రాలను అందజేయనున్నారు. భక్తులు సేద తీరేందుకు గుడి చుట్టూ తాత్కాలిక వసతిని ఏర్పాటు చేశారు. భక్తులు బయట కూడా కల్యాణాన్ని వీక్షించేలా 12 సెంటర్లలో 46 ఎల్​ఈడీ స్క్రీన్లు పెట్టారు. పట్టణంలో రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.