శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ తల్లి గుడి.. వీకెండ్ లో చేసే బెస్ట్ డివోషనల్ ట్రిప్ ఇదే

శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ తల్లి గుడి.. వీకెండ్ లో చేసే బెస్ట్ డివోషనల్ ట్రిప్ ఇదే

కొండలు, గుట్టలు, పచ్చదనంతో నిండిన ప్రకృతి... చూడటం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? మరీ ముఖ్యంగా ట్రావెలర్స్ కి ఇంకా బాగా నచ్చుతుంది. అచ్చంగా ప్రకృతి ఒడిలో వెలిసినట్టుగా ఉన్న శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ తల్లి గుడి కూడా అలానే ఉంటుంది. పద్మనాయకులు కాలం నుంచి సరళ మైసమ్మ తల్లి పేరు అందరికీ తెలిసింది. ఈ అమ్మవారు ఒకప్పుడు వనదేవతగా ప్రసిద్ది. రాచకొండ గుట్టల్లో రెండు గుట్టల మధ్య కొలువైంది సరళ మైసమ్మ తల్లి.

చౌటుప్పల్ మండలం అల్లాపురంలో ఉంది ఈ గుడి. ఇక్కడికి వెళ్లాలంటే గుట్టలు, పచ్చని చెట్లు దాటుకుంటూ జర్నీ చేయాలి. ఈ ఆలయ నిర్మాణం మధ్య కాలం నాటి శిల్పకళని పోలి ఉంటుంది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు గుడి తెరిచి ఉంటుంది. భక్తులు అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పిస్తారు. కొందరు ముడుపులు కూడా సమర్పించుకుంటారు. అమ్మకు బోనం ఇస్తే సంపద కలుగుతుందని నమ్మకం. ఇక్కడ ప్రతి పౌర్ణమి చండీ హోమం నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మే నెలలో ఇక్కడ జాతర సాగుతుంది. దేవీ నవరాత్రుల సమయంలో జనం ఎక్కువగా వస్తారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వచ్చి దావత్లు చేసుకుంటుంటారు.
దగ్గర్లోని కొండల మీదుగా నీళ్లు జలపాతం కిందకి దుంకుతుంటాయి. వీకెండ్ లో డివోషనల్ ట్రిప్ వెళ్లాలి అనుకునేవాళ్లకి సరళ మైసమ్మతల్లి గుడి మంచి ఛాయిస్. అడవి తల్లి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ గుడి ట్రావెలర్స్కి కొత్త అనుభూతి ఇవ్వడం ఖాయం.

ఇలా వెళ్లాలి

యాదాద్రి - రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంది సరళ మైసమ్మ ఆలయం. హైదరాబాద్ నుంచి 46కిలోమీటర్ల దూరం జర్నీ చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. చౌటుప్పల్ నుంచి అయితే 18 కిలోమీటర్ల జర్నీ. కారులో లేదా బైక్ మీద వెళ్లొచ్చు.