కమనీయం.. శ్రీనివాస కల్యాణం

కమనీయం.. శ్రీనివాస కల్యాణం
  • భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
  • గోవింద నామస్మరణతో మార్మోగిన పురవీధులు

కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరాలయంలో లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శ్రీనివాసుడి కల్యాణం భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తింది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ నారాయణస్వామి వివాహ ఘట్టాన్ని అర్చకులు కనులపండువలా నిర్వహించారు. యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు చెందిన పండితులతోపాటు నగరానికి చెందిన వేద పండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి కల్యాణం జరిపించారు.

కన్యాదానం చేసిన అన్నమయ్య వారసులు..

ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కల్యాణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ సోదరి, -బావ అరుణ-శంకర్ శ్రీవారి తరపున కల్యాణోత్సవంలో పాల్గొనగా.. తాళ్లపాక అన్నమయ్య వారసులు తాళ్లపాక స్వామి, దేవేరి తరపున కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. పండితుల మంత్రోచ్ఛరణ మధ్య మాంగల్యధారణ చేశారు. ఈ వేడుకలో మినిస్టర్​కమలాకర్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. అనంతరం తిరుమల నుంచి తెప్పించిన 15వేల లడ్డూలను భక్తులకు పంచారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ స్వరూపారాణి, కమిషనర్ ఇస్లావత్ పాల్గొన్నారు.