శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న యాక్షన్-కామెడీ చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ క్రాంతి, సీతా క్రాంతి నిర్మిస్తున్నారు. 1992 నాటి విశాఖపట్నం మాడుగుల గ్రామం నేపథ్యంలో నక్సలిజం అంశంతో ఈ సినిమా రూపొందుతోంది. శుక్రవారం మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీవిష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నక్సలైట్ నాయకుడిగా శ్రీవిష్ణు కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంది.
మెడలో రెడ్ టవల్ నుదుటిపై ఎర్రని బొట్టుతో ఇంటెన్స్ లుక్‌లో ఉన్న తన గెటప్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తను సీరియస్‌గా నడుచుకుంటూ వస్తుండగా, బ్యాక్‌డ్రాప్‌లో మిగిలిన కామ్రేడ్స్ డప్పులు కొడుతూ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుంది. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
