ఉన్నది ఉన్నట్టు చెప్పిండు సీఎం మాటల్లో తప్పేముంది? : శ్రీధర్​బాబు

ఉన్నది ఉన్నట్టు చెప్పిండు సీఎం మాటల్లో తప్పేముంది? : శ్రీధర్​బాబు
  • పదేండ్లు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందుంచారు: శ్రీధర్​బాబు
  • ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు 
  • ఎంప్లాయిస్​ అందరూ మా మిత్రులే.. ఆలస్యమైనా సమస్యలను పరిష్కరిస్తం
  • అందాల పోటీలకు, ఉద్యోగుల సమస్యలకు సంబంధమేంటి?
  • మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? 
  • బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్​లో తిరగలేదా? 
  • ప్రభుత్వాన్ని నడపాలా? లేదా? అనేది బీజేపీ నిర్ణయిస్తదా? 
  • అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి?
  • పహల్గాం ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్న
  • మీడియాతో మంత్రి శ్రీధర్​బాబు చిట్​చాట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం రేవంత్​రెడ్డి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారని, ఆయన మాటల్లో తప్పేముందని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు.  రాష్ట్రాన్ని దివాళా తీసేలా బీఆర్ఎస్ నాయకులు పాలన చేశారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ప్రజల ముందు ఉంచే ప్రయత్నంలో ఆ మాటలు మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు. తమ సీఎం ముక్కుసూటిగా మాట్లాడారని, ఆయన మాటల్ని ఆవేదనగానే భావించాలని చెప్పారు.  

రాష్ట్రంలోని ఉద్యోగులందరూ తమ ప్రభుత్వానికి మిత్రులు, సోదరులేనని  స్పష్టం చేశారు. మంగళవారం  సీఎల్పీలో శ్రీధర్​బాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆలస్యం అయినా ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు ఉండవని తెలిపారు. సీఎం రేవంత్ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. కొంతమంది ప్రభుత్వాన్ని బెదిరించేలా మాట్లాడడంతో ఆవేదన చెందిన సీఎం..అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. వాస్తవానికి పదేండ్లపాటు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందు ఉంచే ఉద్దేశంతో రేవంత్ ఆ మాటలు మాట్లాడితే.. వాటిని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలిందో రేవంత్ చెప్పే ప్రయత్నం చేశారన్నారు.  బీఆర్ఎస్ చేసిన ఘనకార్యాలతో తమ ప్రభుత్వానికి అప్పు పుట్టడం లేదని రేవంత్​ చెప్పారని, అప్పులపై ఇప్పటికే శ్వేత పత్రం కూడా విడుదల చేశామని తెలిపారు. రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసి, కేవలం రూ. 4 లక్షల కోట్లు అప్పు మాత్రమే ఉందని కేటీఆర్ ఎలా అంటారని మండిపడ్డారు.  రాబోయే రోజుల్లో వనరులను ఎలా పెంచుకోవాలనే దానిపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. వనరులు పెంచుకొని వాటిపై అప్పు చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.  

హెలికాప్టర్ ​వాడకంతోనే తక్కువ ఖర్చు

హెలికాప్టర్ ను తాము అధికారిక కార్యక్రమాలకు వినియోగిస్తే.. దాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలోనే  హెలికాప్టర్ ను  ప్రభుత్వం అద్దెకు తీసుకున్నదని, దాన్ని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్​హయాంలో  హెలికాప్టర్ వాడలేదా? కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఓ అధికారి సైతం హెలికాప్టర్ ను వినియోగించిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.  తమ ప్రభుత్వంలో ముగ్గురు, నలుగురు మంత్రులు జిల్లాల పర్యటనలకు హెలికాప్టర్ ను వాడితే తప్పేముందని అన్నారు. దీని వల్ల సమయం వృథా కాకుండా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశం మంత్రులకు ఏర్పడుతున్నదని చెప్పారు.

 ఒక్కో జిల్లా పర్యటనకు కారు కన్నా.. హెలికాప్టర్ వినియోగంతోనే ఖర్చు తక్కువ అని అన్నారు. హెలికాప్టర్ కు అద్దె చెల్లిస్తూ ఖాళీగా ఉంచడం కన్నా ఇలా ప్రోగ్రామ్ లకు వినియోగించడంలో తప్పుందా? అని అడిగారు.  బీజేపీ నేతలు, ఎంపీ రఘునందన్ చేసిన విమర్శలకు శ్రీధర్​బాబు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని దిగిపోవాలని అనే హక్కు వాళ్లకు ఎక్కడిదని ప్రశ్నించారు. దేశంలో పహల్గాంలాంటి ఘటనలకు నైతిక బాధ్యత వహించి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ రాజీ పడబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని నడుపాలా? లేదా? అనేది నిర్ణయించేది బీజేపీ నేతలు కాదని.. ప్రజలని పేర్కొన్నారు.  అసెంబ్లీని తాము ఎందుకు రద్దు చేస్తామని శ్రీధర్​బాబు ప్రశ్నించారు.

ఉద్యోగులపై బీఆర్ఎస్​కు​ ప్రేమ లేదు

అందాల పోటీలకు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధం ఏమిటని మంత్రి శ్రీధర్​బాబు ప్రశ్నించారు. మిస్​ వరల్డ్​ పోటీలు అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు పేరు తెచ్చేవని, ఇలాంటి ప్రోగ్రామ్స్​ గౌరవాన్ని తెచ్చిపెడుతాయని అన్నారు. పైగా వీటివల్ల పర్సనాలిటీ, సంక్షేమం, అభివృద్ధి, సామాజిక  చైతన్యం వెల్లివిరుస్తాయని చెప్పారు. ఉద్యోగులపై బీఆర్ఎస్ కు ప్రేమ ఎక్కడిదని ప్రశ్నించారు. రిటైర్​మెంట్​ బెనిఫిట్స్ ఇవ్వలేమనే కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ  వయస్సు ను  పెంచారని,  సరిగ్గా జీతాలు ఇవ్వలేని వారు ఇప్పుడు వారి సమస్యలపై ఎలా మాట్లాడుతారని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.

 దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కొందరు  ఇచ్చిన హామీలను రెండు, మూడు టర్మ్ లు పూర్తి చేసుకున్నా అమలు చేయలేదని, అలాంటి వారు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తే వర్క్ ఫ్రం హోం ఎలా అవుతుందని ప్రశ్నించారు.