- భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన
- అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా అభివృద్ధి ప్రణాళికలు
- ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ పెట్టుబడులను భారీస్థాయిలో ఆకర్షించేలా పదేండ్లలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహానగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు.
అందుకే భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నొవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.
నిరుడు 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్‌లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
