
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కలకలం రేగింది. ఆలయ భద్రతా వ్యవస్థ వైఫల్యంపై మరోసారి చర్చ జరిగింది. తమిళనాడు భక్తులు రాతితో చేసిన రెండు నాగశిలలను ఒకటో గేటు నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. రూ.750 మండపంలో రాతి నాగశిలలను పెట్టి 11.40 గంటల ప్రాంతంలో సర్పదోష నివారణ పూజకూడా చేశారు. ఆ తర్వాత మహద్వారం దగ్గర ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో హోంగార్డులు గుర్తించి నాగశిలలను స్వాధీనం చేసుకున్నారు.
ఒకటో గేటు, రాహుకేతు పూజా మండపాల దగ్గర భద్రతా వ్యవస్థ వైఫల్యంపై ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలయ భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వహయాంలో నాలుగేళ్ల క్రితం ముక్కంటి ఆలయ సిబ్బంది భద్రతా వైఫల్యం కారణంగా గుర్తుతెలియని భక్తులు శివలింగం, నంది ప్రతిమలను ఆలయంలోపల అనధికారికంగా ప్రతిష్ఠించారు. దీనిపైవిచారించి శివలింగం, నంది ప్రతిమలను ఆలయంలోకి తీసుకొచ్చిన తమిళనాడు భక్తులపై అప్పట్లో కేసు నమోదుచేశారు.
రెండేళ్ల క్రితం 8వతరగతి విద్యార్థి రాత్రి అలయంలో ఉండగానే.. భద్రతాధికారులు తాళం వేశారు. రాత్రంతా ఆ విద్యార్థి ఆలయంలో సంచరించడమే కాకుండా భద్రతా సిబ్బందికి చిక్కకుండా దర్జాగా మూడవ గోపురం వద్ద ప్రహరీ దిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆలయ నిబంధనలకు విరుద్దంగా రాతి నాగశిలలతో తమిళనాడు భక్తులు ప్రవేశించి.. పూజా మండపంలో పూజలు చేయడంపై ఆలయ భద్రతా సిబ్బంది వైఫల్యం గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది.