
కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. మలేసియా మాస్టర్స్–500 టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో క్వాలిఫయర్స్‌లో శ్రీకాంత్ 9–21, 21–12, 21–6తో హుయాంగ్ యు కాయ్ (చైనీస్‌తైపీ)పై గెలిచాడు. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లోనూ శ్రీ 21–8, 21–13తో కువో కుయాన్ లిన్ (చైనీస్‌తైపీ)ని ఓడించాడు.
ఇక బుధవారం (May 21) నుంచి మొదలయ్యే మెయిన్ డ్రాలో శ్రీకాంత్.. లు గుయాంగ్ జు (చైనా)తో ఆట మొదలుపెడతాడు. ఇతర క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో తరుణ్ మానేపల్లి 13–21, 21–23తో పనిట్చాఫోన్ తీరరత్సకుల్ (థాయ్‌లాండ్) చేతిలో, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ 20–22, 20–22తో జు జుయాన్ చెన్ (చైనా) చేతిలో ఓడారు.
విమెన్స్‌లో అన్మోల్ కర్బ్ 14–21, 18–21తో హంగ్ యి టింగ్ (చైనీస్‌తైపీ) చేతిలో కంగుతిన్నది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్ జగ్లాన్–లక్షిత జగ్లాన్ 15–21, 16–21తో మింగ్ యాప్ టూ–లీ యు షాన్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశారు.