వేములవాడ పట్టణంలో శృంగేరి జగద్గురు

వేములవాడ పట్టణంలో శృంగేరి జగద్గురు
  • ..శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి ధర్మ విజయయాత్ర
  • స్వాగతం పలికిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలాజ రామయ్యర్

వేములవాడ, వెలుగు : శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి ధర్మ యాత్ర ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కొనసాగింది. ధర్మ యాత్రకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలాజరామయ్యర్ స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చరణలు, కేరళ వాయిద్యాలు, ఒగ్గు డోలు మధ్య వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి రాజన్న ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. 

స్వామివారి ధర్మయాత్రతో పట్టణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహస్వామివారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాజరాజేశ్వర స్వామివారికి ఆయన కోడె మొక్కు పూజ చెల్లించారు. కోటి లింగాలను సందర్శించి ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న తరుణంలో అభివృద్ధి పనుల మ్యాప్ ను పరిశీలించారు. అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్​వారికి వివరించారు. చివరగా జగద్గురు చంద్రమౌళీశ్వర పూజ నిర్వహించారు. 

కోట్లాది మంది భక్తుల నమ్మకమే వేములవాడ క్షేత్రం..

కోట్లాది మంది భక్తుల నమ్మకమే వేములవాడ రాజన్న క్షేత్రమని శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి అన్నారు. ఆలయ ఓపెన్​స్లాబ్​లో భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈశ్వరుడి అజ్జతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజన్న భక్తులకు  పరమేశ్వరుడు ఆశీస్సులు అందిస్తున్నారని పేర్కొన్నారు. 

ఆలయంలో అభివృద్ధి పనులు శాస్త్రం ప్రకారం నడుస్తున్నాయని తెలిపారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా గుడి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి కావాలని పరమేశ్వరుడిని వేడుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం.హరిత, ఎస్పీ మహేష్ బి.గితే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు ప్రతాప రామకృష్ణ  పాల్గొన్నారు.