మేడిగడ్డపై ఎల్​ అండ్​ టీనే అడగండి : శ్రీనివాస్‌గౌడ్

మేడిగడ్డపై ఎల్​ అండ్​ టీనే అడగండి : శ్రీనివాస్‌గౌడ్
  • కాంట్రాక్టర్లు, ఆఫీసర్ల వల్లే లోపాలు: శ్రీనివాస్‌గౌడ్
  • పెద్దపెద్ద ప్రాజెక్టులే కొట్టుకపోతయ్..
  • అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరిగి ఉండొచ్చు
  • రిపేర్లు చేసి నడిపించుకోవాలని కామెంట్​

హైదరాబాద్, వెలుగు :  కాంట్రాక్టర్లో, ఆఫీసర్లో చేసే తప్పులకు ప్రాజెక్టుల్లో లోపాలు తలెత్తడం సహజమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మేడిగడ్డలో కూడా అలాగే జరిగి ఉండొచ్చని చెప్పారు. వాటిని అలాగే వదిలేయకుండా.. రిపేర్లు చేయించి నడిపించుకోవాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

మేడిగడ్డ కుంగడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పేమి లేదన్నారు. ఇల్లు కట్టుకునేటప్పుడో, ఆ తర్వాతనో అది కుంగిపోతే మేస్త్రీదో, ఇంజనీర్‌‌‌‌‌‌‌‌దో తప్పు అవుతుందని, ఇల్లు కట్టించుకున్న ఓనర్ తప్పు కాదు అన్నారు. ‘‘పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతయి. ఎల్‌‌‌‌ అండ్ టీ కంపెనీ మన దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, దేవాలయాలు కట్టింది.

లోపాలు జరిగితే ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కుంగిపోయిందని దాన్ని అట్లనే పెడితే ఇంకా నష్టం జరుగుతుంది. ఆయనది తప్పా, నీది తప్పా అనుకుంటూ పోతే ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. మేడిగడ్డను సత్వరం రిపేర్ చేయించి అందుబాటులోకి తీసుకురావాలి” అని అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పొప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు. ఎక్కడైనా కాంట్రాక్టర్లు నష్టం చేయొచ్చు. కాంట్రాక్టర్లు, అధికార్ల వల్ల ఎక్కడైనా లోపం జరగొచ్చు. ప్రకృతి వైపరిత్యాల వల్ల కూడా జరగొచ్చు. మీ హయాంలో జరిగింది. మీరే బాధ్యులు అనడం పద్ధతి కాదు” అని అన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా వదలడం లేదని, కరెంటు ఉన్న ఇవ్వడం లేదని ఆరోపించారు.

మా పని అయిపోలే

రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై శ్రీనివాస్‌‌‌‌గౌడ్ మండిపడ్డారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కొంత మంది పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయిందనడం సరికాదన్నారు. రైతుల గురించి కేసీఆర్ మాట్లాడితే ప్రభుత్వం ఉలిక్కి పడుతోందన్నారు. ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా, మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

ఉద్యమకారులను ఆదుకోండి

‘‘ఇంకా స్వరాష్ట్ర ఫలాలు అందని ఉద్యమకారులు, ప్రజలు ఎంతో మంది ఉన్నరు. వాళ్లను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మా హయాంలో ఎవరికి న్యాయం జరగలేదో, వాళ్లకు న్యాయం చేయాలి. కాంగ్రెస్‌‌‌‌ను అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ వారిని ఆదుకోండి, మా పార్టీపై నిందలు వేయకండి” అని ప్రభుత్వానికి సూచించారు.