ఆ సామగ్రి ఎవరివి?

ఆ సామగ్రి  ఎవరివి?
  • ఆ సామగ్రి  ఎవరివి?
  • క్యాంపు ఆఫీసు సామగ్రి తీసుకెళ్తున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
  • అడ్డుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు, విద్యార్థులు
  • నిన్న బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో..  ఇవాళ ఆబ్కారీ మంత్రి పేషీ ఖాళీ

హైదరాబాద్:  బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. రేపు కాంగ్రెస్ సర్కారు కొలువు దీరనుంది. ఈనేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. సాక్షాత్తూ నిన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగి రాజసం ప్రదర్శించిన వాళ్లు ఇండ్లకే పరిమితమయ్యారు. నియోజకవర్గాల్లో నిర్మించిన క్యాంపు ఆఫీసుల్లోని ఏసీలు, ఫర్నిచర్ ను సైలెంట్ గా తమ కార్యకర్తలతో క్యాంప్ ఆఫీసు నుంచి తరలించుకుపోతుండటం వివాదాస్పదంగా మారుతోంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు రాత్రే బోధన్ క్యాంప్ ఆఫీసు నుంచి ఏసీలు, కుర్చీలను తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించగా స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ లీడర్లు ఏకంగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇవాళ ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రవీంద్రభారతి లోని తన పేషీ నుంచి ఫర్నిచర్ ను తరలిస్తున్న విషయాన్ని గమనించిన ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు.

అప్పటికే ఒక లోడ్ టీజీవో ఆఫీసుకు వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఫర్నిచర్ ను తరలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్యాంపు ఆఫీసులు, మంత్రుల పేషీల్లో సొంత ఆస్తులు, పుస్తకాలు, కంప్యూటర్లు ఏమైనా ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.  

పర్మిషన్ లేకుండా తీసుకెళ్లొద్దు

ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, మంత్రుల పేషీల్లో సామగ్రి అంతా ప్రభుత్వానిదేనని, ఒక వేళ సొంత వస్తువులేమైనా ఉంటే అనుమతి లేకుండా తీసుకెళ్ల వద్దని సీఎస్ శాంతి కుమారి చెప్పారు. ఒక వేళ తీసుకెళ్లినా రికవరీ చేస్తామని చెప్పారు.