సీతారాముల కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పణ

సీతారాముల కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పణ

ఆకాశమంత పందిరి….. భూదేవంత అరుగు. జగదబిరాముడు, జానకీ దేవీల కల్యాణానికి అంతా సిద్దమైంది. దక్షిణ ఆయోధ్యగా పిలిచే భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఇందుకోసం మిథాలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. శ్రీరాముడికి కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా…పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి సిద్ధమయ్యారు. మధ్యామ్నం 12 గంటల వరకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణం జరగనుంది.

కల్యాణోత్సవానికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్త రామదాసు నిర్ణయించిన మేరకు ఆరుబయట సీతారాముల కల్యాణం ఘనంగా జరగనుంది. ముందుగా దేవాలయంలో ధృవమూర్తుల కల్యాణం చేస్తారు. ఆ తర్వాత మంగళవాయిద్యాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువస్తారు. తిరుకల్యాణ సంకల్పానంతరం విశ్వక్సేనారాథన నిర్వహిస్తారు. వేద మంత్రోచ్చారణల మధ్య అభిజిన్మహుర్తమున జీలకర్రబెల్లాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. మంగళసూత్రాలతో భక్తరామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి ధరింపచేయటం భద్రాద్రి ఆచారం.  ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమం పూర్తి చేశారు.

….

రాములోరి కమనీయ వేడుకను తిలకించేందుకు రాష్ట్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భద్రాద్రి రామయ్య కల్యాణం సందర్భంగా పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది.