
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు:‘‘మోహన్.. మన పని అయిపోయింది. ఇక మనం బతకడం కష్టం. ఆశలు వదులుకో’’ శ్రీశైలం పవర్ హౌస్ అగ్నిప్రమాదం టైంలో తోటి ఉద్యోగి మోహన్ తో ఏఈ సుందర్ రాజు చెప్పిన మాటలివీ. చనిపోవడానికి కొద్దిక్షణాల ముందు మోహన్, సుందర్ మధ్య జరిగిన ఈ సంభాషణ ఆడియో తాజాగా బయటకొచ్చింది. ప్లాంట్ మొత్తం పొగలు కమ్ముకున్నటైమ్ లో సుందర్ తన మొబైల్లో దీన్ని రికార్డ్ చేశాడు. ప్రమాదం తర్వాత లోపలికి వెళ్లిన సిబ్బందికి సుందర్ మొబైల్ దొరికింది. మరి కొన్ని క్షణాల్లో తమ ప్రాణాలు పోతాయని గ్రహించిన సుందర్ తోటి ఉద్యోగి మోహన్ తో మాట్లాడుతూ ఈ వీడియోతీశాడు. వీడియో స్పష్టంగా లేకపోయినాఆడియో క్లియర్ గా రికార్డయ్యింది.
ఆ క్షణంలో వారు పడిన భయం, తమకు ఏం జరుగుతుందో అనే ఆందోళన స్పష్టంగా తెలిసింది. ఇంకా లోపలే ఉంటే మన పని అయిపోతుందని మోహన్ తో సుందర్ చెప్పగా.. మరి కొద్ది సేపు చూద్దాం .. ఆశలు ఉండాలి కదా.. అని మోహన్ అతడిని సముదాయించే ప్రయత్నం చేశాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఏఈలు మోహన్, సుందర్ ప్లాంట్ ను చివరి వరకూ కాపాడే ప్రయత్నం చేసి తమ ప్రాణాలను వదిలారు. చనిపోయే కాసేపటి ముందు మోహన్ తన భార్యతో మాట్లాడినట్లు కుటుంబీకులు తెలిపారు. తాను ఇక ఇంటికి రాలేనని, పది నిమిషాల్లో చనిపోతానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని భార్యకు చెప్పాడు.