
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి నిరంతరాయంగా భారీ వరద వస్తుండడంతో మంగళవారం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం పది గంటల వరకు మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఆఫీసర్లు..తర్వాత మరో రెండు గేట్లను ఎత్తి ఐదు గేట్ల ద్వారా నీటిని వదిలారు.
ఇన్ఫ్లో 2 లక్షల 86 వేల 598 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో అలర్టయిన అధికారులు 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని వదిలారు. ఔట్ ఫ్లో 3 లక్షల 37 వేల 312 క్యూసెక్కులుగా వెళ్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 884.20 అడుగుల నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 210.9946 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.