
శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం ( అక్టోబర్ 22) నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక మాసంలో రూ.5 వేల గర్భాలయ అభిషేకం టికెట్లు, రూ.1500 సామూహిక అభిషేకం టికెట్లు రద్దు చేశారు.
కార్తీకమాసం నెల రోజుల పాటు విడతల వారీగా మల్లి కార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో అమ్మవారి అంతరాలయంలో కుంకు మార్చనలు నిలిపేసి.. ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తామన్నారు. కార్తీక మాసంలో ( అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు) భక్తుల రద్దీ దృష్ట్యా శని,అది,సోమ,కార్తీక పౌర్ణమి,ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు ...గర్భాలయ,సామూహిక అభిషేకాలు నిలిపి వేసినట్లు ఈవో తెలిపారు. సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు.
కార్తీకమాసంలో ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, నవంబర్ 14న కోటి దీపోత్సవం, 18న తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హోమాలు, కల్యాణాలు యథావిధిగా జరుగుతాయన్నారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.