మల్లన్న భక్తులకు కీలక అప్ డేట్ : శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనానికి బ్రేక్.. ఎందుకంటే..

 మల్లన్న భక్తులకు కీలక అప్ డేట్ : శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనానికి బ్రేక్.. ఎందుకంటే..

 శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో జూలై 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనం రద్దు చేశారు. శ్రీశైలానికి యాత్రికులు క్యూ కట్టారు. దీనికితోడు  ఇక్కడి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలిస్తున్నారు

 భక్తుల రద్దీ దృష్ట్యా   శ్రీశైలం మల్లన్న స్వామి స్పర్శ దర్శనాన్ని నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. శ్రీశైలంలో స్పర్శ దర్శనం చేసుకునేందుకు  భక్తులు ఒక రోజు ముందుగా టికెట్ బుక్ చేసుకోవలసి ఉంది.  ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్​ అన్ని గేట్లను ఎత్తి వేయడంతో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది.  సహజంగా శ్రీశైలం ప్రాజెక్ట్​ సందర్శనకు వచ్చిన వారు శివయ్యను దర్శించుకుంటారు. 

మల్లికార్జున స్వామిని స్పర్శించడం శ్రీశైలం, కాశీలో మాత్రమే భక్తులకు అవకాశం ఉంది. భక్తుల కోరిక మేరకు క్యూ లైన్‌లో వచ్చే భక్తులకు ఆధార్ ద్వారా టోకెన్ జారీ చేసి ఉచిత స్పర్శ దర్శనం కల్పించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సెలవులు, బ్రహ్మోత్సవాలు, మహోత్సవాలు, పర్వదినాల్లో స్పర్శ దర్శనం ఉండదు. మిగిలిన రోజుల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు దర్శనం చేసుకోవచ్చు. అయితే తాజాగా భక్తుల రద్దీని గమనించి  జులై 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనాలను రద్దు చేస్తూ  నిర్ణయం తీసుకున్నారు.. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనం ప్లాన్ చేసుకోవాలని  ఆలయ అధికారులు సూచించారు. సర్వ దర్శనం క్యూలైనలలోని భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. జూలై 19 తర్వాత పరిస్థితిని పరిశీలించి మళ్లీ స్పర్శ దర్శనాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఈవో తెలిపారు.