శ్రీశైలం హుండీ ఆదాయం లెక్కింపు

శ్రీశైలం హుండీ ఆదాయం లెక్కింపు

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు. కరోనా కారణంగా గత ఏడాది నుంచి వరుసగా లాక్ డౌన్లు.. ఆ తర్వాత పరిమిత సంఖ్యలోనే దర్శనాలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి నెలా ఒకటి లేదా రెండుసార్లు లెక్కించాల్సిన హుండీని దాదాపు రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత 61 రోజుల అనంతరం ఇవాళ లెక్కించారు. చాలా రోజులు మూసి ఉండడంతో ఆదాయం తక్కువగా ఉంటుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ భక్తులు భారీగానే మొక్కుబడులు చెల్లించుకున్నారు. 
నగదు రూపంలో 60 లక్షల 19 వేల 628 రూపాయలు హుండీలలో లభించాయి. అలాగే 82 గ్రాముల బంగారు, 940 గ్రాముల వెండి ఆభరణాలు కూడా హుండీలలో లభించాయి. వీటితోపాటు  365 ఇంగ్లండ్ పౌండ్లు, 60 యూఏఈ దిర్హమ్ లు, 5 యూరోలు, 1 యూఎస్ డాలరు మొదలైన విదేశీ కరెన్సీ కూడా దొరికింది. 
దేవస్థానం ఈవో కె.ఎస్ రామారావు, ఈఏఓలు ఇతర అధికారులు దగ్గరుండి హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. శానిటైజ్ చేసిన ప్రాంగణంలో సీసీ కెమెరా నిఘా మధ్య లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.