శ్రీవారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం

శ్రీవారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం

తిరుపతి: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీవారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆది‌వారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల నడుమ శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు  స్నప్న తిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం మ‌హ‌ల్ ముఖ మండ‌పం ప్రాంగ‌ణంలో  ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం 8.15 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఈ ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించిన వారికీ,  దర్శించిన వారికీ, అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం,  ముఖ ప్రక్షాళన,  ధూపదీప నైవేద్యం,  ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు,  పెరుగు,  తేనె, కొబ్బరినీళ్లు,  పసుపు,  గంధంతో స్నప్నం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.