- గ్రేటర్లో 65 వేల కొత్త ఆటోలకు మూడు నెలల కింద పర్మిట్లు
- రెట్రో ఫిట్టెడ్ కోసం 25 వేల ఆటోలకు పర్మిషన్
- పెట్రోల్, డీజిల్ ఆటోలను సీఎన్జీ, ఎల్పీజీకి కన్వర్ట్ చేసుకునే అవకాశం
- ఖర్చు ఎక్కువంటూ వెనుకడుగు వేస్తున్న డ్రైవర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్లో రెట్రో ఫిట్టెడ్ ఆటోలకు రెస్పాన్స్ రావడం లేదు. ఓఆర్ఆర్పరిధిలో 65 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని మూడు నెలల కింద ప్రభుత్వం జీవో నంబర్ 263 జారీ చేసింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 సీఎన్జీ, 10 వేల ఎల్పీజీ ఆటోలు ఉండగా, రెట్రోఫిట్టెడ్గా మార్చుకునేందుకు మరో 25 వేల ఆటోలకు పర్మిట్లు ఇచ్చింది. అంటే ఇప్పటివరకూ ఉన్న 25 వేల డీజిల్, పెట్రోల్ఆటోలను సీఎన్జీ లేదా ఎల్జీజీ ఆటోలుగా మోడిఫై చేసుకునే అవకాశం కల్పించింది.
అయితే, కొత్త ఆటోలకు కోసం ఎగబడుతున్న డ్రైవర్లు.. రెట్రో ఫిట్టెడ్ఆటోలపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రెట్రోఫిట్టెడ్ కోసం గత మూడు నెలల నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఫలితంగా నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ఇచ్చిన రెట్రోఫిట్టెడ్లక్ష్యం నెరవేరడం లేదు.
కొత్తదే కొనుక్కుంటే పోలే..
పాత పెట్రోల్, డీజిల్ఆటోలను రెట్రో ఫిట్టెడ్గా మార్చుకునేందుకు ముందుగా ఆయా ఆటోల యజమానులు ఆర్టీఏకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించాక ఆటోల ఫిట్నెస్నుపరిశీలించి అధికారులు అప్రూవల్ఇస్తారు. ఆ తర్వాత ఆయా కంపెనీలను సంప్రదించి రెట్రోఫిట్టెడ్గా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, పాత ఆటోలను రెట్రోఫిట్టెడ్ ఆటోలుగా మార్చుకోవాలంటే ఒక్కో ఆటోకు రూ.1.20 లక్షల నుంచి 1.45 లక్షల వరకు ఖర్చు వస్తుందని డ్రైవర్లు చెప్తున్నారు. దానికి బదులు కొత్త ఆటో కొనుక్కోవచ్చని, ఫైనాన్షియర్లు కూడా రెట్రోఫిట్టెడ్కు ఫైనాన్స్చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు.
డీలర్లు, ఫైనాన్షియర్లు కుమ్మక్కై..
కొత్త ఆటోలను కొనుగోలు చేయాలనుకునేవారు ఒకేసారి డబ్బు చెల్లించే స్థోమత లేక ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా డీలర్లు, ఫైనాన్షియర్లు కుమ్మక్కై ఆటోల అసలు ధర కంటే దాదాపు రూ.50 వేల నుంచి 70 వేల వరకు అధికంగా అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎన్టీ, ఎల్పీజీ ఆటో అసలు ధర రూ.2.35 లక్షలు వరకు ఉండగా, రూ.3 నుంచి 3.25 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. తమకు ఇచ్చే ఇన్వాయిస్లో మాత్రం అసలు ధరనే చూపిస్తున్నారని, బిల్లులు కూడా అలానే ఇస్తున్నట్టు ఆటో డ్రైవర్లు ఆర్టీఏ అధికారులకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
