యాసంగి లెక్క పక్కా ! 5.22 లక్షల ఎకరాలు సాగు అంచనా

యాసంగి లెక్క పక్కా ! 5.22 లక్షల ఎకరాలు సాగు అంచనా
  • గతేడాదికంటే 7 వేల ఎకరాలు అధికం
  • 4.31 లక్షల ఎకరాల్లో వరి సాగు 
  • 60 వేల ఎకరాల్లో దొడ్డురకం.. మిగతాదంతా సన్నాలే..
  • తర్వాత స్థానం జొన్నలు, మేత గడ్డి
  • ప్రాజెక్టులు, చెరువుల్లో సమృద్ధిగా నీరు

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : యాసంగి సాగు అంచనాను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతేడాది యాసంగిలో 5.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈసారి 5.22 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయని అధికారులు అంచనా వేశారు. దీంతో గడిచిన యాసంగి కంటే 7 వేల ఎకరాల్లో సాగు పెరగనుంది. అధికంగా 4.31 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, 60 వేల ఎకరాల్లో దొడ్డు రకం, మిగతాదంతా సన్న  వరి సాగు కానుంది. వరి తర్వాత జొన్నలు, మేత గడ్డి పంటలు సాగు కానున్నాయి. 

అంచనాలకు తగ్గట్టుగా రాష్ట్ర సర్కార్​విత్తనాలు, ఎరువుల పంపిణీకి సన్నాహాలు చేసింది. జిల్లాలో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులు, చెరువుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయి. లిఫ్ట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లతోపాటు భూగర్భజలాలు పెరిగి బోర్లల్లో పుష్కలంగా నీరు ఉంది. దీనికితోడు ప్రభుత్వం వ్యవసాయానికి సరిపడా కరెంట్ సరఫరా చేస్తోంది.  

వరి సాగే అధికం.. 

యాసంగిలో అధికంగా వరి సాగు కానుంది.  వానాకాలంలో 5.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, అందులో 4.27 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలో  4.31 లక్షల ఎకరాలకు వరి సాగు పెరగనుందని  వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎంఎస్‌‌‌‌పీతో పాటు ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్​తో రైతుల్లో కొత్త ఉత్సాహం నింపింది. అధికారుల నివేదిక ప్రకారం, యాసంగిలో 3.70 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి సాగు, 60,793 ఎకరాల్లో దొడ్డురకం వరి సాగయ్యే అవకాశం ఉంది.  

పాడి మేతకు ప్రాధాన్యం..  

ఈసారి పాడి మేతకు రైతులు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వరి సాగు తర్వాత 25,202 ఎకరాల్లో మక్కజొన్న సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. పశువుల మేత కోసం 24,867 ఎకరాల్లో గడ్డి సాగు చేయనున్నారు. నువ్వులు, సజ్జ పంటల సాగు గత సీజన్‌‌‌‌తో పోలిస్తే పెరగనుందని అధికారులు తెలిపారు. కంపెనీ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడం, బహిరంగ మార్కెట్‌‌‌‌లో సరైన ధర రాకపోవడం వల్ల పొగాకు సాగు తగ్గనుంది. 

గతేడాది 3,824 ఎకరాల్లో పొగాకు సాగు చేయగా, ఈసారి 2,065 ఎకరాలకే పరిమితం కానుందని అధికారుల నివేదిక తెలుపుతోంది. పది ఏళ్ల క్రితం వరకు ఆరుతడి పంటల్లో మంచి ఆదరణ పొందిన సోయాబీన్‌‌‌‌ సాగుపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ఈ యాసంగిలో కేవలం 213 ఎకరాల్లో సోయాబీన్‌‌‌‌ సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. చెరకు సాగు విస్తీర్ణం కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయ వనరులు, మార్కెట్‌‌‌‌ పరిస్థితులు, లాభనష్టాలను లెక్కలు వేసుకుని ఈసారి రైతులు జాగ్రత్తలు పాటిస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

వాస్తవాలకు దగ్గరగా అంచనాలు

జిల్లాలో యాసంగి సాగు అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలు, లిఫ్ట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లు, బోర్ల వినియోగం వంటి అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఈ రిపోర్టు ఆధారంగా విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  గోవిందు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్​