- నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బలహీన వర్గాల నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ఎర్రగడ్డ డివిజన్లో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానికంగా ఉండే సమస్యలు నవీన్‌యాదవ్‌కు తెలుసు కాబట్టి.. అతన్ని గెలిపిస్తే వాటిని పరిష్కరించడం సులువవుతుందన్నారు. రానున్న రెండు రోజులు కష్టపడి పనిచేస్తే నవీన్ యాదవ్ విజయం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు.
నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న షాపులకు ఇంటి యజమానులతో సంబంధం లేకుండా జీరో బిల్లు వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ లో నాయీ బ్రాహ్మణ సంఘానికి 10 గుంటల స్థలం కేటాయించి రూ. 10 లక్షల నిధులతో భవనం ప్రారంభించామన్నారు. కులవృత్తులను గౌరవంగా భావించి ఆత్మస్థైర్యంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీని అనుసరిస్తూ వృత్తులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సెలూన్ షాపులు మోడ్రన్‌గా మార్చేలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు కృషి చేస్తానన్నారు.
