- బీఆర్ఎస్, బీజేపీ నేతలపై జూపల్లి ఆగ్రహం
జూబ్లీహిల్స్, వెలుగు: ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు జూబ్లీహిల్స్ కాంగ్రెస్అభ్యర్థి నవీన్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లింలకు సరైన ప్రాధ్యానం ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నదని చెప్పారు. గత మూడు దఫాలుగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. ఆశించిన మేర అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఈ ప్రాంతాన్ని మరింత బాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం నేతలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
