- గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో ప్రమాదం
శాంతినగర్, వెలుగు : ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల జూలకల్లు గ్రామ పరిధిలో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన దస్తగిరి కూరగాయలు సాగు చేస్తున్నాడు.
శుక్రవారం కోసిన కూరగాయలను దస్తగిరి కొడుకు విశ్వాస్ (18), ఆటో డ్రైవర్ మహేశ్ (20)తో కలిసి సమీపంలోని శాంతినగర్ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూరగాయలు విక్రయించిన అనంతరం తిరిగి వస్తుండగా.. జూలకల్లు సమీపంలోకి రాగానే ఆటోను ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో విశ్వాస్, మహేశ్ అక్కడికక్కడే చనిపోయారు.
సమాచారం అందుకున్న శాంతినగర్ సీఐ టాటా బాబు, ఎస్సై నాగశేఖర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
రోడ్డు ప్రమాదంలో విలేజ్ సెక్రటరీ...
కొత్తకోట, వెలుగు : కారును లారీ ఢీకొట్టడంతో ఓ విలేజ్ సెక్రటరీ చనిపోయాడు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద శుక్రవారం జరిగింది. కొత్తకోట ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం తుంకినపూరు విలేజ్ సెక్రటరీ పెండ్లి శుక్రవారం గద్వాలలో జరిగింది. ఈ పెండ్లికి కొత్తకోట మండలం వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీశ్ (34)తో పాటు మరికొందరు హాజరయ్యారు.
పెండ్లి ముగిసిన తర్వాత కారులో తిరిగి వస్తూ... పాలెం సమీపంలో బ్రిడ్జి దగ్గర కారును ఆపారు. ఇదే టైంలో కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సతీశ్‌ను మహబూబ్‌నగర్ జిల్లా హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. మూసాపేట సెక్రెటరీ మహేందర్, పోల్కంపల్లి కార్యదర్శి నాగేందర్, చక్రపూర్ కార్యదర్శి కార్తీక్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
