
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో రోజుకో దారుణం వెలుగుచూస్తున్నది. సోమవారం ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఐవీఎఫ్ చికిత్స కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వస్తే సరోగసీ వైపుకు మళ్లించి.. లక్షల్లో డబ్బు తీసుకున్నారంటూ ఫిర్యాదులు అందాయి. పలువురు బాధితులు గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్చేయడంతో సృష్టి సెంటర్‌పై మరో 4 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, నగదు బదిలీ వివరాలు.. ఇలా అన్ని అధారాలను తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేశారు.
నల్గొండకు చెందిన సంతానం లేని దంపతులకు ఆశచూపిన డాక్టర్ నమ్రత.. వారివద్ద నుంచి రూ. 44 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో డాక్టర్నమ్రత, సదానందం, చెన్నారావుతోపాటు కౌన్సిలింగ్ ఇచ్చిన అర్చన, సురేఖపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి.. ఎగ్, స్పెర్మ్ తీసుకొని..
హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సదరు బాధితురాలికి సరోగసీ చేస్తామని చెప్పి ఎగ్ డెవలప్‌మెంట్ కోసం హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చిన డాక్టర్ నమ్రత.. కొన్ని రోజుల తర్వాత ఆమెను విశాఖపట్నం పంపించింది. అక్కడున్న సృష్టి బ్రాంచి నిర్వాహకురాలు సి.కళ్యాణి అచ్చాయమ్మ, సిబ్బంది.. ఆమె నుంచి స్పెర్మ్, ఎగ్ తీసుకొని తిరిగి పంపిచారు. ఆ తర్వాత సరోగసీ ప్రారంభించామని చెప్పి రూ.18 లక్షలు తీసుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే, ఓ ఎన్నారై జంటను నమ్మించి, వారి నుంచి రూ 25 లక్షలు వసూలు చేసి మోసం చేశారని కంప్లయింట్రావడంతో.. డాక్టర్ నమ్రత, ఆమె ఏజెంట్లపై కేసు నమోదైంది. హైదరాబాద్ సిటీకి చెందిన మరో బాధితురాలి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన డాక్టర్ నమ్రతతోపాటు ఆమె అనుచరులు చెన్నారావు, సురేశ్‌పై గోపాలపురంలో మరో కేసు రిజిస్టర్ అయింది.
►ALSO READ | సీజ్ చేసిన వాహనాలు అమ్ముకుంటూ.. అడ్డంగా బుక్కయిన కానిస్టేబుళ్లు
మరోవైపు నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో సృష్టి కేసులో ప్రధాన నిందితులు డాక్టర్నమ్రత, కళ్యాణి, ధనశ్రీ సంతోషి కస్టడీ విచారణ కొనసాగుతున్నది. వీరు పోలీసులకు చెప్పే విషయాలు, సమాచారంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. కాగా, సృష్టి దారుణాల్లో డాక్టర్నమ్రతతోపాటు పాలు పంచుకున్న డాక్టర్విద్యుల్లతపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె సోమవారం విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్విద్యుల్లత పేరుపైన డాక్టర్నమ్రత ఐవీఎఫ్, సరోగసీ సెంటర్‌ను నడిపిస్తున్నట్టు సమాచారం.