పతాక స్థాయికి తెలుగు సినిమా మార్కెట్

పతాక స్థాయికి తెలుగు సినిమా మార్కెట్

సోమవారం ఉదయం మన భారతావని కొద్ది సేపు చాలా ఉద్విగ్నంగా గడిపింది. ఎలక్షన్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు, క్రికెట్ లో ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అని గోళ్లు గిల్లుకుంటూ చూస్తున్నట్లు.. చాలా మంది టీవీలకు, సెల్ ఫోన్ లకు హతుక్కుపోయారు.  క్షణాలు గడుస్తున్నాయి... ఆస్కార్ ప్రకటనలు ఒక్కొక్కటిగా వెలుబడుతున్నాయి. మన సినిమా గురించి ఊసేది? అనుకుంటూంటే..ఈ లోగా తలవని తలంపుగా 'ది ఎలిఫెంట్ విస్పర్స్' అనే ఇండియన్  డాక్యుమెంటరీ ఫిల్మ్‌‌కు పురస్కారం వచ్చింది. ఆనందం..హ్యాపీ... కానీ సంపూర్తిగా లేదు. ఎందుకంటే చాలా మంది ఎదురుచూస్తోంది 'నాటు నాటు'  ఆస్కార్ కోసం. నెలలుగా చూస్తున్న ఎదురుచూపులకు ముగింపు పలికే క్షణాలు అవి. ఈ లోగా ఒక్కసారిగా ఆస్కార్ గోస్ టూ ఆర్​ఆర్​ఆర్​ అనే ప్రకటన. అంతే.. దేశం హోరెత్తిపోయింది.

మీడియా మైమరిచిపోయింది. దేశం అంతా  ఆర్​ఆర్​ఆర్ ఆస్కార్ కోసం ఎదురుచూస్తున్నారా అన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస పోస్ట్​ల వర్షం. వాట్సప్​లో డీపీలు మారిపోయాయి. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదే.  ఆస్కార్​కు మన సినిమాలు, మన నటులు వెళ్లటం కొత్తేమీ కాదు. ‘హేరామ్’ లాంటి సినిమాల కోసం కమల్ హాసన్, లగాన్ టైమ్‌‌లో ఆమీర్ ఖాన్ ఆస్కార్ మెట్ల దాకా వెళ్లి వచ్చారు. ఏఆర్ రెహమాన్.. జైహో అంటూ ఆస్కార్ గెలిచారు. కానీ ఇంత ఊపు ఎప్పుడూ రాలేదు. అందుకు కారణం రాజమౌళి మనవాడు. ఆర్​ఆర్​ఆర్ మన సినిమా అని ఫీల్ అవటమే. ఇన్నాళ్లూ మన వాళ్లకు  అందని ద్రాక్షగా ఊరిస్తూ వచ్చిన  ఆస్కార్ రాగానే.. అందరూ ఆ పురస్కారం తమ అరిచేతుల్లోకి వచ్చినట్లు ఎమోషనల్ గా ఫీలయ్యారు. 

రాజర్షి రాజమౌళి

వాస్తవానికి ప్రతి సంవత్సరం ఇండియా నుండి సినిమాలు ఆస్కార్​కు నామినేట్ అవుతున్నాయి. కాని ఆస్కార్ అవార్డును మాత్రం దక్కించుకోవడం లో వెనుకబడుతున్నాయి. పెద్ద నిట్టూర్పుతో మనకు రాదులే అని సరిపెట్టుకుంటున్నాం. అతి చిన్న ఇండస్ట్రీ అయిన కొరియన్ ఇండస్ట్రీ వరుసగా ఆస్కార్​లు దక్కించుకుంటూ ఉంటే మన ఇండియన్  సినిమాలు మాత్రం ఇంకా ఆస్కార్​కు నామినేట్ అవ్వడమే గొప్ప విషయంగా అనుకుంటున్నాం. ఏదో తెలియని బాధ. రకరకాల కారణాలతో ఆస్కార్ అందకుండా పోతోంది.  ఇక ఆస్కార్ వచ్చే అస్కారం మన సినిమాలకు లేదులే అని అందరం భావిస్తున్న వేళ రాజమౌళి రంగంలోకి వచ్చారు. ఆయన గెలిచారు. మనల్ని గెలిపించారు. అవును.. ఈ కృషి రాజర్షి రాజమౌళిదే. తెలుగు సినిమా మార్కెట్​ని విస్తరిస్తూ, తన తర్వాత వారికి దారులు వేస్తూ ముందుకు వెళ్తున్న ధీరుడు. ఈగ సినిమాతోనే మార్కెట్ విస్తరించటం అనే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్​ని ఊహించని పతాక స్థాయికి తీసుకెళ్లిపోయారు. ఈ రోజు పుష్ప, కేజీఎఫ్​ వంటి సినిమాలు ప్యాన్ ఇండియాగా మారాయంటే రాజమౌళి చలువే. అంతెందుకు బాహుబలి మార్కెట్ స్ట్రాటజీనీ ఫాలో అయ్యామని పఠాన్ సినిమా నిర్మాణ సంస్థే స్వయంగా ప్రకటించింది. 

ప్రపంచస్థాయిలో ఓ పెద్దమెట్టు

ఇక ఆర్ఆర్ఆర్​కు ఆస్కార్​తో నెక్స్ట్ లెవెల్ గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునే సందర్భం క్రియేట్ చేసారు. పర్సనల్​గా చూస్తే రాజమౌళి నెక్స్ట్ సినిమా బిజినెస్, క్రేజ్​కు ఈ హైప్, గెలుపు  ఖచ్చితంగా పనికొస్తుంది. అయితే అదే సమయంలో మిగతా చిన్న, పెద్ద సినిమాలు కూడా ఈ దారిలో ప్రయాణం పెట్టుకోవటమే అసలైన సక్సెస్. ఆస్కార్ అనేది కేవలం రాజమౌళికో, కీరవాణికో, చంద్రబోస్ కో, ఎన్టీఆర్, రామ్ చరణ్ లేదా ఆ సినిమా టీమ్ కో పని కొచ్చే విషయం కాదు. భారతీయ సినిమాకు మరీ ముఖ్యంగా తెలుగు  సినిమాకు బిజినెస్ మార్కెటింగ్ పరంగా మరో పెద్ద మెట్టు. ఎందుకంటే బిజినెస్, మార్కెటింగ్ విస్తరణ సరిగ్గా లేకపోతే ఏ పెద్ద సినిమా ధైర్యంగా చేయలేరు. రెవెన్యు వెనక్కి రాదు. కాబట్టి ఇవాళ ఇచ్చిన ఈ ఆస్కార్ బూస్టింగ్... ఖచ్చితంగా మన వాళ్లను నెక్స్ట్ లెవెల్​కు తీసుకెళ్తుంది.

ప్రపంచ నైపుణ్యం నేర్చుకోవాలి.

ఈ సమయంలో రాజమౌళి ఇచ్చిన స్పూర్తిని,  విజయాన్ని కొనసాగించాలంటే  ఆయన ఎంచుకున్న స్ట్రాటజీలు కూడా గమనించగలగాలి. వాటిని అధ్యయనం చేయాలి. ఊరికే వచ్చింది కాదు ఈ సక్సెస్ అని అర్థం చేసుకోవాలి. సినిమా తీయటం... దాన్ని ప్రమోట్ చేయటం... ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవటం అనే నైపుణ్యం నేర్చుకోవాలి. అప్పుడే మరిన్ని 'నాటు నాటు'లు వస్తాయి. అదే సమయంలో మన భారతీయ ఆత్మను ఒడిసి పట్టుకున్న 'ది ఎలిఫెంట్ విస్పర్స్' లాంటి సినిమాలను అధ్యయనం చేయాలి. దేని విలువ దానిదే. మరిన్ని ఆస్కార్​లు భవిష్యత్​లో మన దేశం నుంచి ఆశించేందుకు మొహమాట పడద్దు. జైహో భారత్.
 జోశ్యుల సూర్య ప్రకాష్, సినీ రచయిత, సీనియర్​ జర్నలిస్ట్​