కరోనా టైంలో ఇంటింటి సర్వేనా?

కరోనా టైంలో ఇంటింటి సర్వేనా?
  •     కేజీబీవీ టీచర్లకు వివాదాస్పద ఉత్తర్వులిచ్చిన ఎస్ఎస్ఏ 
  •     వైరస్ విజంభిస్తున్నాఅడ్మిషన్ల కోసం ఆఫీసర్ల తాపత్రయం 
  •     ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని టీచర్ల డిమాండ్ 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం కరోనాతో  ఆగమైంది. ఈ సంవత్సరం అడ్మిషన్లు ఎన్ని జరిగాయో కూడా స్పష్టత లేదు. అయినా వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే అడ్మిషన్ల కోసం ఇంటింటి సర్వే చేయాలని సమగ్ర  శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆఫీసర్లు కేజీబీవీ టీచర్లకు ఆదేశాలిచ్చేశారు. అయితే ఈ వివాదాస్పద ఉత్తర్వులపై టీచర్లు, యూనియన్లు మండిపడుతున్నాయి. వెంటనే ఆ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

టార్గెట్ ప్రకారం అడ్మిషన్లు 

రాష్ట్రంలో 475 కేజీబీవీలుండగా, వాటిలో 6 నుంచి12 వ తరగతి వరకు కొనసాగుతున్నాయి. అయితే వీటిలో పనిచేసే స్పెషల్ ఆఫీసర్తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ కాంట్రాక్టు ఎంప్లాయీసే. వీరందరినీ ప్రతీ సంవత్సరం ఒకటి, రెండు రోజుల గ్యాప్తో రెన్యువల్ చేస్తుంటారు. 2021–22 అకాడమిక్ ఇయర్ కోసం ఈనెల16న అందరినీ టర్మినేట్ చేసి, మళ్లీ 20న కొత్తగా రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్... డీఈఓలకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేజీబీవీ టీచర్లతో డోర్ టు డో ర్ సర్వే నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు. ప్రతి కేజీబీవీ పరిధిలోని గ్రామాల్లో టీచర్లు ఇంటింటికీ తిరిగి స్టూడెంట్లతో మాట్లాడి, అడ్మిషన్లు చేయాల్సి ఉంటుంది. ప్రతి క్లాసులో ఉన్న సీట్ల టార్గెట్‌‌కు అనుగుణంగా అడ్మిషన్లు చేయాలి. అయితే మాములు టైమ్లో  సర్వేలు చేశామని,  రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న  సమయంలో ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం కష్టమేనని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి సర్వే ఆదేశాలను విద్యాశాఖ అధికారులు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. 

ఉత్తర్వులు నిజమే కానీ..

కేజీబీవీ టీచర్లు ఇంటింటి సర్వే చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు నిజమేనని ఎస్ఎస్ఏ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాల్సిన అవసరం లేదని, ఫోన్ల ద్వారా సర్వే నిర్వహిస్తే సరిపోతుందని తెలిపారు. కానీ ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో, ఇంటింటి సర్వే చేయాలని టీచర్లకు డీఈఓలు ఆదేశాలిచ్చేందుకు రెడీ అవుతున్నారు.