ఇయ్యాల జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య పై అవిశ్వాసం

ఇయ్యాల జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య పై అవిశ్వాసం
  • క్యాంపు నుంచి నేరుగా మీటింగ్ కు అసమ్మతి కార్పొరేటర్లు 
  • ఉదయం 11 గంటలకు ఓటింగ్ 
  • కార్పొరేషన్ ఆఫీసు వద్ద 144 సెక్షన్  

జవహర్ నగర్ వెలుగు : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది.  మేయర్ వర్సెస్ కార్పొరేటర్లుగా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం వేడెక్కింది. 19 మంది కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై  సోమవారం ఉదయం 11 గంటలకు ఓటింగ్ జరగనుంది.  సొంత పార్టీ మేయర్ పైనే రెండుసార్లు  అవిశ్వాసం తీర్మానం నోటీసు ఇచ్చి నెల రోజులుగా పక్క రాష్ట్రంలో  కార్పొరేటర్లు  క్యాంపులో ఉంటున్నారు. వీరంతా సోమవారం ఉదయం నేరుగా సమావేశానికి రానున్నారు.  

స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి గుండెకాయగా భావించే జవహర్ నగర్ కార్పొరేషన్ లో  ఆయన బినామి అయిన మేయర్ పై సొంత పార్టీ కార్పొరేటర్లే అవిశ్వాసం పెట్టడడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. మేయర్ అనుచరులు మాత్రం అవిశ్వాసం విగిపోతుందని మద్దతు తెలిపే కార్పొరేటర్లకు సూచిస్తుండగా..   తెర వెనుక మరో ప్రముఖ కార్పొరేటర్ చక్రం తిప్పుతున్నాడు.  అవిశ్వాస తీర్మానాన్ని ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కార్పొరేషన్ లో ఉత్కంఠ నెలకొంది. కలెక్టర్ ఆదేశాల మేరకు 144 సెక్షన్  విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.  

పోలీసు ఎస్కార్ట్ తో కార్పొరేటర్ల తరలింపు

ఎల్ బీనగర్:  జవహర్ నగర్ మేయర్ పై అవిశ్వాసం ఓటింగ్ సందర్భంగా క్యాంపునకు వెళ్లిన19 మంది కార్పొరేటర్లు కర్ణాటక నుంచి యాదగిరిగుట్టకు వస్తున్నారు.  మరొకవర్గం వారు పెద్ద అంబర్ పేట్ ఔటర్ వద్ద వారిపై దాడి చేసేందుకు కాపు కాశారని తెలియడంతో రక్షణ కోసం ఆదిబట్ల పీఎస్ కు వెళ్లారు. పోలీస్ ఎస్కార్ట్ తో కార్పొరేటర్లను మరో చోటికి తరలించారు. వీరిని మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటికి తరలించినట్లు తెలుస్తుంది.