ఆలయంలో తొక్కిసలాట ఆరుగురి మృతి..

ఆలయంలో తొక్కిసలాట ఆరుగురి మృతి..
  • గోవాలో ఘటన
  • 80 మంది  భక్తులకు గాయాలు.. కొందరి పరిస్థితి విషమం

పణజి:  గోవాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శిర్గావ్​ గ్రామంలోని శ్రీ లైరాయ్​దేవీ ఆలయ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు క్యూలో వేచి ఉన్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో చాలామంది కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 80 మంది భక్తులు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, క్షతగాత్రులు వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 

వీరిలో కొంతమంది కండిషన్​ సీరియస్​గా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఉత్సవాల్లో భాగంగా  భక్తులు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగిందని, 30 వేల నుంచి 40 వేల మంది ఒకేచోట గుమికూడడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. 

ఒక్కసారి రద్దీ పెరగడంతో..

నార్త్​ గోవాలోని శిర్గావ్​లో ఉన్న శ్రీ లైరాయ్​ అమ్మవారి ఆలయ వార్షిక జాతర శుక్రవారం ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలలతోపాటు మహారాష్ట్ర, కర్నాటకనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన ‘నిప్పులపై నడిచే’ ఆచారంలో వేలాది మంది పాల్గొన్నారు. దాదాపు 30వేల నుంచి 40 వేల మంది ఒకేచోట చేరగా తొక్కిసలాట జరిగింది. చాలామంది కిందపడిపోయారు. 

ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడ్డవారిని సమీప దవాఖానలకు తరలించి, చికిత్స అందజేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం

ఘటనా స్థలాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్​ పరిశీలించారు.  దవాఖానలకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై  ప్రధాని నరేంద్ర  మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్​ చేశారు. తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందడం విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక పాలనా యంత్రాంగం సాయం అందిస్తుందన్నారు.